ఇటు సినిమా – అటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం ఇక కుదరదని పవన్ డిసైడ్ అయిపోయాడు. ఇక మీదట.. తన ధ్యాసంతా… రాజకీయాలపైనే. అందుకే సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు టాలీవుడ్ టాక్. ఈ విషయం తన నిర్మాతలకు కూడా చెప్పేసినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌లో పవన్ ఓ సినిమా చేయాలి. అందుకోసం ఎప్పుడో అడ్వాన్స్ తీసుకొన్నాడు. హరీష్ శంకర్ కథ సిద్ధం చేశాడు. ఆ సినిమా చేసే పొజీషన్ లో పవన్ లేడు. ఈ విషయాన్ని మైత్రీ కి పవన్ చెప్పేశాడట. అంతే కాదు.. అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చాడట.కానీ మైత్రీ పవన్ లాంటి హీరోని వదలుకోదు కదా. `అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా సినిమా చేయండి చాలు` అని సున్నితంగా చెప్పినట్టు టాక్. అయితే పవన్ వెనక్కి ఇవ్వాల్సిన అడ్వాన్సులు కొన్ని ఉన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ దగ్గర పవన్ భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకొన్నాడు. ఆయన.. పవన్ కోసం కథలు సిద్ధం చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు కూడా పక్కకు వెళ్లిపోయినట్టే. ఈ అడ్వాన్స్ మాత్రం పవన్ తిరిగి ఇవ్వాల్సిందే. కాకపోతే.. ఇవన్నీ పవన్ స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన అడ్వాన్సులు. పవన్ పై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశ్యం ఏ నిర్మాతకీ లేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పవన్ సినిమా చేస్తాడన్న నమ్మకంతో ఉన్నారంతా. కాబట్టి అడ్వాన్సులు వెనక్కి ఇవ్వాల్సిందే అనే ఒత్తిడి అయితే పవన్ దగ్గర లేదు. అదొక్కటే పవన్‌కి కాస్త వెసులుబాటు.