సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం `యశోద`. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ వచ్చినా, కలక్షన్లు ఓ మోస్తరుగా ఉన్నా – బిజినెస్ పరంగా నిర్మాతని ఈ సినిమా సేఫ్ జోన్లో పడేసింది. బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోల్ గా ఉంటూ, ఇలాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలు సమంతతో చేస్తే నిర్మాతలకు గిట్టుబాటు అవుతుందన్న విషయం యశోదతో తెలిసొచ్చింది. ఇప్పుడు యశోద 2 తీసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.
యశోద 2 మాత్రమే కాదు.. యశోద 3 తీయడానికి కూడా కాన్సెప్టు తమ దగ్గరరెడీగా ఉందని దర్శకుడు హరి – హరీష్ తెలిపారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా ఇదే మాట చెబుతున్నారు. “యశోద సీక్వెల్ గురించి అందరూ అడుగుతున్నారు. సమంత ఒప్పుకొంటే పార్ట్ 2 చేయడానికి సిద్ధంగా ఉన్నా. కొత్త కొత్త క్రైమ్‌లు పుట్టుకొస్తున్నాయి. వాటికి పరిష్కార మార్గాలూ ఉన్నాయి. అందుకే యశోద 2 విషయంలో కథకు ఢోకాలేదు.. “ అని చెప్పుకొచ్చారు నిర్మాత. యశోద 2, యశోద 3 కాన్సెప్టులు కూడా తమ దగ్గర సిద్ధంగా ఉన్నాయని, సమంత సంపూర్ణ ఆరోగ్యం తో తిరిగొచ్చాక.. ఈ కథలు చెబుతామని దర్శకులు అంటున్నారు. సో.. ఈ సినిమాకి సీక్వెల్ రావడం దాదాపుగా ఖయమన్నమాట.