ముఖ్యమంత్రిగా గెలిచే అసెంబ్లీకి వస్తానని సవాల్ చేశానని గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు కర్నూలులో చెప్పడంపై విపక్ష పార్టీలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. ఎవరి అభిప్రాయం వారిది. అయితే రాజకీయంగా చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే చంద్రబాబు ఇక రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని అనుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు వాయసు ఇప్పుడు 70 దాటిపోయింది. 2029 ఎన్నికలకు ఎనభై దగ్గరకు వస్తుంది. ఆ వయసులో ఆయన ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం కష్టమే. చంద్రబాబు మహా అయితే ఇంకో ఆరేడేళ్లు మాత్రమే యాక్టివ్గా రాజకీయాలు చేయగలరు.
ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద ఎంత శ్రద్ధ పెట్టినా.. వయసు పెరుగుతూనే ఉంటుంది.నిజానికి రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి..ఐదేళ్ల పాటు ప్రజల సంపదను పెంచడంతో పాటు చార్జీల భారం లేకుండా పాలన చేసిన తనకు..ప్రజలు అంత ఘోర పరాజయం బహుమతిగా ఇస్తే ఏ రాజకీయ నాయకుడికైనా.. ఈప్రజల కోసమా కష్టపడింది అని అనుకుంటారు. అయితే చంద్రబాబులో అలుపెరుగని రాజకీయ నేత ఉన్నారు. అందుకే ఓటమిని జీర్ణించుకుని మళ్లీ ప్రజల్లోకి వెంటనే వచ్చారు. ప్రజా మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్పిరిట్ ఉన్న నేత రాజకీయాల నుంచి విరమించుకుంటారని ఎవరూ అనుకోరు.కానీ ఆయన నోటి నుంచి ఆ మాట రావడం సంచలనం అయింది.
వాస్తవానికి చంద్రబాబు చెప్పిందే జగన్ రోజూ చెబుతున్నారు. చంద్రబాబును ఈసారి ఓడిస్తే తమకు తిరుగు ఉండదని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతీ రోజూ తమ పార్టీ నేతలకు చెబుతున్నారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లోనూ ఓడిపోతే చంద్రబాబు వయసు రీత్యా యాక్టివ్గా ఉండలేరని.. ఈ కారణంగా టీడీపీ కూడా ఇబ్బంది పడుతుందని.. తమకు ఎదురు ఉండదని ఆయన ఆలోచనని రాజకీయాల్లో కనీస అవగాహన ఉన్న ఎవరికైనా తెలుస్తుంది.
అయితే చంద్రబాబు గెలవకపోయినా .. రాజకీయాల్లో ఉండరంటే ఎవరూ నమ్మరు. రాజకీయాల్లో సన్యాసం సవాళ్లు అతి సాధారణం. కానీ ఎవరూ ఇంత వరకూ సన్యాసం తీసుకోలేదు. చంద్రబాబు రాజకీయాలు చేయకుండా ఖాళీగా ఉంటారని ఎవరూ అనుకోరు. చంద్రబాబు ప్రకటన ఓ రాజకీయ ఎత్తుగడగానే అందరూ భావిస్తున్నారు. కానీ రాజకీయంగా తమకు అనుకలంగా విశ్లేషించుకునేందుకు ఎక్కువ తాపత్రయ పడుతున్నారు. వాస్తవంగా అయితే.. వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై ప్రయత్నమే.