బాహుబలి సినిమా ఇప్పటికే చూసినవాళ్లు ఉన్నారు. అలాగే ఇంకా చూడని వాళ్లూ ఉన్నారు. ఎవరైనా సరే ఇక్కడ చెప్పబోయే పది అంశాలు (టాప్ టెన్) గురించి ఓసారి తెలుసుకోండి. ఆతర్వాత ఒక్కసారి చూస్తే సరిపోతుందా, లేక మళ్ళీమళ్ళీ చూడాలా అన్నది మీరే తేల్చుకోండి.
1. శిల్పకళ:
బాహుబలి సినిమాను ఏదో మామూలు సినిమా అన్న భావనతో చూడకండి. అందులో గమనించాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో మొదటి అంశం – శిల్పకళా నైపుణ్యం. మాహిష్మతి రాజ్యం నిజంగా ఉండేదా, లేక అభూతకల్పనా అన్నది పక్కన పెడితే, దాదాపు ఒక వెయ్యి సంవత్సరాల క్రిందట సకల సౌభాగ్యాలతో తులతూగే రాజ్యం ఎలా ఉండేదన్న ఊహకు మాహిస్పతి రాజ్యంలోని కోట, ప్రధాన కట్టడాలు ఓ సుందర దృశ్యరూపంగా నిలిచాయనే చెప్పాలి. ఆనాటి శిల్పకళా నైపుణ్యం ఎలా ఉండేదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తీశారు ఈ సినిమాను. అందమైన శిల్పాలు, నీటి కొలనులు, పౌంటేన్లు… ఇలా ఎన్నో మనకు బ్యాక్ డ్రాప్ లో కనబడుతుంటాయి. మొదటి సారి వెళ్ళినప్పుడు సహజంగా ప్రేక్షకుడు కథలో మమేకమైపోతుంటాడు. సన్నివేశ నేపథ్య సెట్టింగ్స్ అంతగా గమనించము. జాగ్రత్తగా గమనిస్తే ఈ సినిమాలో శిల్పకళా నైపుణ్యం ఎంతటిదో ఆస్వాదించవచ్చు. భారీ విగ్రహాలు, ఆకాశాన్నంటే మందిరాలు, కోట గోడలు, దేవాలయాలు, గోపురాలు…ఇలా అన్నింటిలోనూ శిల్పకళా చతురత కనబడుతుంది.
2. ప్రకృతి అందాలు
బాహుబలి సినిమా ఎలా తీశారు ? గ్రాఫిక్స్ తో తీశారా, సెట్టింగ్స్ తో తీశారా ? వంటి ప్రశ్నలకు తావివ్వకుండా సినిమాను సినిమాలాగానే ఆస్వాదిద్దామనుకుంటే మీరు గమనించాల్సిన రెండవ అశం – ప్రకృతి అందాలు. మహా జలపాతం – ఈ సినిమాకే హైలెట్. నిజంగానే అంత ఎత్తైన జలపాతం దగ్గర సినిమా తీశారా ! అన్నంత భ్రమకొలిపేలా వాటర్ ఫాల్ దృశ్యాలను చిత్రీకరించారు. జలపాత హోరు, ఆ కొండలపై గజిబిజీగా అల్లుకున్న చెట్ల కొమ్మలు. పచ్చటి చెట్లు, లతలు, విరబూసిన పూలు…ఇలా ప్రకృతి కాంత పులకించి పచ్చటి పానుపు పరిచినట్టు అనేక దృశ్యాలు ఇందులో ఉన్నాయి. మరో విశేషం… నీలి రంగు సీతాకోక చిలకలు. గుంపుగుంపులుగా ఎగురుతుంటే చూడముచ్చటేస్తుంది. అలాగే, చెట్ల కొమ్మలమీద, ఆకులమీద, నేలమీద మంచుపేరుకుపోయి అప్పుడే వెండివాన కురిసిందా అన్నట్టు కనబడుతుంది. మంచు పర్వత శ్రేణుల అందాలు, అంతలో మంచు తుపాను వస్తే అది ఎంతవేగంగా, వడివడిగా దిగువకు దూసుకువస్తుందో చూపించే దృశ్యాలు అపూర్వం.
3. నాగరికత
మానవ జాతి ఆవిర్భావం తర్వాత నాగరికత పరిఢవిల్లింది జీవనదుల పక్కనే. చరిత్రను చక్కగా అధ్యయనం చేసి మానవ నాగరికతలోని భిన్న కోణాలను స్పృశించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈ చిత్రం ప్రారంభంలోనే ఒక మహాసామ్రాజ్యాన్ని చూపుతారు. దాని పేరు మాహిష్మతి రాజ్యం. ఇది నాగరికంగా బాగా ఎదిగిన రాజ్యం. దానికి చేరువలో కుంతల రాజ్యం. దీన్ని కూడా మరోనాగరిక సమాజం ఏర్పాటు చేసుకున్నదే. మహా పర్వశ్రేణులకు దిగువన ఒక ఆటవిక సమాజం కూడా ఉంది. మధ్యలో విలాసవంతమైన జీవనం గడిపే ఒక సమాజంమనకు కనబడుతుంది. వీటన్నింటికీ భిన్నమైన సమాజం కాలకేయులది. తెగించి పోరాడే జాతి ఇది. కాలకేయులు నల్లగా బలిష్టంగా ఉంటారు. ఈ సమాజానికి స్థిరత్వంలేదు. రాజ్యవిస్తరణ కాంక్షతో వలస వాదనను బలపరుస్తూ నిత్యం యుద్ధాలు చేస్తూ మందుకు పోతుంటారు. ఎక్కడ సౌకర్యాలు లభిస్తాయో అక్కడికి ఆఘమేఘాల మీద మిడతల దండులా వచ్చి వాలడం వీరి నైజం. భారతీయ నాగరికతలను గమనిస్తే నదుల పక్కన ఉన్న సమాజాలు సుఖశాంతులతో స్థిరంగా ఉంటే, ఎడారి ప్రాంతాల్లోనో, లేదా కొండ ప్రాంతాల్లోనో ఉద్భవించిన మానవజాతి క్రమంగా తమ మనుగడకోసం పరిఢవిల్లిన నాగరిక సమాజాలవైపు దూసుకువెళ్ళినట్టు చరిత్ర చెబుతోంది. అదే కనిపిస్తుంది ఈ సినిమాలో… ఇలాంటి సమాజాలను అనాగిరక సమాజాలుగా బహుశా నాగరికులమని అనుకునే సమాజాలవారు పిలుస్తుండవచ్చు. కానీ, నాగరికత, అనాగరికత అన్నవి వారివారి భౌగోళిక, వాతావరణ పరిస్థితులను బట్టే ఏర్పడుతుంటాయి. ఈ చిత్రంలో విభిన్న నాగరిక జాతుల వైఖరిని చూపించడంలో కొంతలో కొంత ప్రయత్నం జరిగిందనే చెప్పాలి.
4. మనుగడ కోసం పోరాటం
మానవ జాతి ఆవిర్భావం నుంచి ఈ జాతి ఎదుర్కున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే, మనుగడను `సుస్థిరం’ చేసుకోవడం. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా, మిగతా జీవజాతుల నుంచి ఉద్భవించే ప్రమాదాలు, తమ జాతిలోని మిగతా సమాజాల నుంచి ఏర్పడే సవాళ్లు వంటి వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కుంటూ ముందుకు సాగడం అనివార్యమైన చర్య. అందుకే ప్రతి జాతి తన మనుగడ కోసం పోరాడుతూనే ఉంటుంది. డార్విన్ సిద్ధాంతం కూడా దీన్నే బలపరిచింది. ఈసినిమాలో నాగరిక, అనాగరిక (వారి వారి ఆలోచనల ప్రకారం) జాతుల మధ్య యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించారు. విజయమో వీరస్వర్గమో అన్నట్టుగానే మనుగడ కోసం పోరాటాలు సాగుతుంటాయని మానవ నాగరిక చరిత్ర చెప్పిన సత్యం.
5. యుద్ధ వ్యూహం
ఈ సినిమాలో మాహాభారత యుద్ధంలాంటి మహా పోరాటాన్ని చూడవచ్చు. మనకు బాగా పరిచయమైన మహాభారత యుద్ధంలో అనేక వ్యూహాలు కనబడతాయి. వాటిలో గరుడ వ్యూహం, పద్మవ్యూహం లాంటివి ఉన్నాయి. పద్మవ్యూహం మనలో చాలామందికి తెలిసిందే. ఈ వ్యూహ రచన కారణంగానే బాలుడైన అభిమన్యుడు విగతజీవుడయ్యాడు. ఇక ఈ సినిమాలో త్రికోణ వ్యూహ రచనతో మాహిష్మతి సైన్యం యుద్ధం చేస్తుంది. చందమామ కథల్లో చాలాకాలం కిందట చదివిన సీరియల్ కథల్లో యుద్ధతంత్రాలు, పోరాటాలు ఎలా ఉంటాయో అచ్చు అలాంటి ఊహాజనిత యుద్ధతంత్రాలు గుర్తుకుతెచ్చేలా సినిమా సాగుతుంది.
6. లోహ యుగం
రాతి యుగం నాటి మానవులకు లోహాల వాడకం తెలియదు. ఇనుము, కంచు, బంగారం వంటి లోహాల వాడకం మొదలైన తర్వాత నాగరికతలో మార్పు చోటుచేసుకుంది. అప్పుడే అలంకరణ పట్ల మోజు ఏర్పడింది. విరివిగా లభించే లోహాలతో పెద్దపెద్ద కట్టడాలు నిర్మిస్తే, అరుదైన లోహాలతో ఆభరణాలు చేయించుకుని వాటిని అలంకరించుకునేవారు. ఈ చిత్రంలో నాగరిక సమాజం ఉపయోగించే వస్తువులు, ఆభరణాలు, యుద్ధ సామాగ్రి (గదలూ, కత్తులు వంటివి) ఎంచుకున్న కాలానికి తగ్గట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, చిత్ర కథకు ఎప్పటి కాలం ఎంచుకున్నారన్నది నిర్ధుష్టంగా చెప్పకపోయినా, కాబూలీ నుంచి వచ్చిన ఒక వ్యాపారస్థుడి పాత్ర ద్వారా మనం కథ ఏనాటిదో ఇంచుమించు ఊహించుకోవచ్చు. అంటే సుమారు వెయ్యి సంవత్సరాల కిందటి కథగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉపయోగించిన యుద్ధ సామాగ్రి ప్రత్యేక శైలిలో ఉండటం గమనార్హం. రెండు సమాజాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు, లేదా యుద్ధానంతరం ప్రజాజీవనంలో మార్పులు వస్తుంటాయి. ఆచారాలు, పనిముట్ల వాడకం, యుద్ధతంత్రాలు, వైవాహిక సంబంధాలు…వంటివి ఇచ్చిపుచ్చుకునే పరిస్థితుల వల్ల ఏర్పడినవే. ఈ అంశంపై బాహుబలి ముగింపు భాగం చూసిన తర్వాత మనం మరింతగా విశ్లేషించుకోవచ్చు.
7. మతం
ఈ సినిమాలో మతపరమైన ఆచారాలు, పోకడల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఇద్దరే దేవతలు కనిపిస్తారు. ఒకటి – పరమ శివుడు. రెండవది కాళికామాత. ఈశ్వరాధానా, శక్తి ఆరాధాన అన్నవి చాలా పురాతనమైన ఆరాధానలు. మాత్రుస్వామ్య వ్యవస్థ నుంచి పిత్రుస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు కేవలం చాలా కొద్దిమంది దేవతలే పూజలందుకున్నారు. ప్రకృతి ఆరాధన నుంచి శక్తి దేవత పుట్టుకొచ్చింది. అలాగే పశు సంపదను కాపాడే పశుపతి నుంచి ఈశ్వర ఆరాధన మొదలైందని చెప్పవచ్చు. శక్తి, పశుపతి నుంచే మతం పునాదులు వేసుకుంది. సినిమాలో ఈ రెంటి గురించే ప్రస్తావన ఉంది. మిగతావాటికి చోటే లేదు. పైగా ఈ ఆరాధనల్లో ఎక్కడా శృతిమించిన ధోరణి మనకు కనబడదు.
8. సాహితీ విలువలు
సినిమాకు ఇదో హైలెట్. జానపదం లేదా పౌరాణిక చిత్రం తీసేటప్పుడు ప్రస్తుత కాలంనాటి భాష కాకుండా అలనాటి భాషలోని తేలికైన పదాలు ఉపయోగించడం రచయితకు కత్తిమీద సాము. కథను ఎంచుకున్న విజయేంద్ర ప్రసాద్ (రాజమౌళి తండ్రి) చాలా శ్రద్ధగా రచన సాగించారు. ఎక్కడా వివాదాలు తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా రచన చేయడమే ఆయన చూపిన శ్రద్ధకు తార్కాణం. కథా వస్తువు చాలా కాలంనాటిదే అయినా ఈనాటి ప్రేక్షకులు చూస్తున్నారన్న భావన గుర్తుపెట్టుకునే రచన చేయడం ముదావహం. అలాగే పాటల రచయితలు కూడా ఇదే ఫార్ములాతో రాశారు. సినిమా చూసేటప్పుడు సరళమైన చక్కటి తెలుగు పదాల జిగిబిగిలు మనం ఆస్వాదించవచ్చు.
9 సంగీతం
కథకు తగ్గట్టుగా సంగీతం సమకూర్చారు కీరవాణి. వాయిద్యాల ఎంపిక మరీ ముఖ్యంగా వాయిలిన్, ఫ్లూట్ వంటి వాటిని ఉపయోగించిన తీరు ప్రశంసనీయం. బ్లాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాలీవుడ్ స్టైల్ లో ఉంది. దీంతో సినిమా చూస్తున్నంతసేపు మనం సంగీత లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. చిత్రంలోని కొన్ని పాటలు కథలో అంతర్భాగమైపోతాయి. కొన్ని మాత్రం పాటలుగా మాత్రమే పైకి తేలినట్టుంటాయి. మొత్తానికి సంగీతాభిమానులు సైతం ఎంతో ఆనందించే సినిమా ఇది.
10. కొత్త భాష
పైన పేర్కొన్నట్టు విభిన్న సమాజాలు ఉన్నప్పుడు, ఒకదానితో మరొకటి కలిసే పరిస్థితి లేనప్పుడు ఎవరి భాష వారిదిగానే చెలామణి అయిపోతుంది. భాషల మధ్య తేడా ఉన్నప్పుడు రెండు సమాజాలు యుద్ధానికి తలపడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో చాలా చక్కగా ఈ చిత్రంలో చూపించారు. అనాగరికులని చెప్పబడే కాలకేయుల భాష – `కిలికి’. నిజానికి ఈ భాష ఎక్కడా లేకపోయినా చిత్రం కోసం సృష్టించారని చెబుతున్నారు. పూర్వం పింగళి గారు మాయాబజార్ చిత్రం కోసం కొన్ని పదాలు (తసమదీయులు, గిల్పం వంటివి) సృష్టించారు. ఇప్పుడు రాజమౌళి మరో మెట్టు పైకెక్కి, ఏకంగా భాష సృష్టించారు. ఈ భాషలో విలన్ (ప్రభాకర్) మాట్లాడుతుంటే ప్రేక్షకులకు ఆశ్చర్యం కలుగుతుంది.
చివరిగా నేను చెప్పేది ఒక్కటే, ఈ సినిమాను చాలా లోతుగా విశ్లేషిస్తూ చూడాలి. అప్పుడే పంచభక్ష పరమన్నాలతో విందు భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. ఒక వేళ అలా రాకపోతే మళ్ళీమళ్ళీ చూడండి, ఆ ఫీలింగ్ వచ్చేవరకు. దటీజ్ బాహుబలి.
– కణ్వస
kanvasa19@gmail.com