కేసీఆర్ కేంద్రంతో లొల్లి పెట్టుకోవడం ఏమో కానీ బడా వ్యాపారస్తులైన టీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థలు, బంధువుల ఇళ్లపై ఐటీ అధికారులు ఒక్క సారిగా దాడులకు దిగారు. కనీసం యాభై బృందాలతో.. సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి అపర కుబేరుడు. ఆయనకు ఇంజినీరింగ్ కాలేజీలు.. మెడికల్ కాలేజీలు.. ఇతర వ్యాపారాలు ఉన్నాయి.ఆయనపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. అవకతవకలకు పాల్పడ్డారని గతంలో రేవంత్ రెడ్డి ఐటీ, ఈడీలకు ఫిర్యాదు చేశారు.
ఆయన వ్యాపార సంస్థలపై రేవంత్ రెడ్డి చాలా సార్లు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. టీఆర్ఎస్తో చెడటంతో పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. అన్నీ బయటకు తీసే చాన్స్ ఉంది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో సీట్ల వ్యవహారంపై లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. పన్ను ఎగవేత అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటి గుట్టు బయటపడితే మల్లారెడ్డి ఇరుక్కుపోయినట్లే.
తెలుగుదేశం పార్టీ ఎంపీగా మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెల్చిన మల్లారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్లో చేరారు. నిజానికి ఆయన విద్యావంతుడు కాదు.పదో తరగతి వరకే చదువుకున్నారు. పాల వ్యాపారం చేశారు. కానీ ఇంజినీరింగ్ … మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఎదిగారు. మేడ్చల్.. మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆయనంత ధనవంతుడు ఉండరు. ఇప్పుడు ఐటీ దాడులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.