సింగర్ మంగ్లీని ఎస్వీబీసీ సలహాదారుగా నియమించి.. నెలకు రూ. లక్ష ఇవ్వాలని నిర్ణయించిన జీవో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్లో జీవో జారీ చేసినట్లుగా ఓ పత్రం వెలుగులోకి వచ్చింది. కానీ ఆమె నాలుగు రోజుల కిందట బాధ్యతలు తీసుకున్నారు. పాత తేదీతోనే బాధ్యతలు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ఆమెకు రూ. నెలకు రూ. లక్ష ఇచ్చి నియమించుకుంటున్నట్లుగా కానీ.. బాధ్యతలు తీసుకుంటున్నట్లుగా కానీ ఎస్వీబీసీ కానీ.. టీటీడీ కానీ ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
రెండేళ్ల పదవీ కాలం ఉండేలా జీవో ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి ఉండే పదవీ కాలం మరో ఏడాదిన్నర మాత్రమే. 2024 మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. అయితే రెండేళ్ల కాలానికి జీత భత్యాలు కల్పించేందుకు ఇలా ముందు తేదీతో ఉత్తర్వులు ఇచ్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. నవంబర్ 17న ఆమె తిరుమలకు వచ్చి.. రెండ్రోజులు అక్కడే ఉండి.. శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనే ఆమె బాధ్యతలు స్వీకరించారని అంతర్గత వర్గాపు చెబుతున్నాయి.
సలహాదారు పదవి వల్ల ప్రతి నెలా ఆమెకు రూ. లక్ష చెల్లించనున్నారు. అలా మంగ్లీ తిరుపతికి వచ్చినప్పుడల్లా.. వాహన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. అలాగే ప్రయారిటీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఆమె సేవలను అవసరమైనప్పుడు ఎస్వీబీసీ సీఈవో వినియోగించుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే.. ఏ పనీ లేకుండానే జీతం ఇస్తారన్నమాట.
గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ఆమెను పార్టీ ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించుకుంది. గత ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రచార పాటలు పాడారు. జగనన్న పేరుతో ఆమె పాడిన పాటలు పాపులర్ అయ్యాయి. అలాగే జగన్ ప్రచార సభల్లోనూ .. ఆయన రాక ముందు నిర్వహించే సాంస్కృతి క కార్యక్రమాల్లో ఖచ్చితంగా మంగ్లి ప్రదర్శ ఇచ్చే వారు. ఆ సేవలకు ఇప్పుడు ఎస్వీబీసీ ఖాతా నుంచి నెలకు రూ. లక్ష చెల్లిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.