తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, వ్యాపారసంస్థలపై దాడుల విషయంలో ఐటీ అధికారులు ఏం స్వాధీనం చేసుకున్నారో తెలియడం లేదు కానీ..యాభై బృందాలు మొత్తం జల్లెడ పడుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు.. మెడికల్ కాలేజీలు..ఇతర వ్యాపారాలకు చెందిన లావాదేవీలు జాతీయ బ్యాంకుల ద్వారా సాగడం లేదు. ఊరూపేరు లేని ఓ చిన్న కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా సాగుతున్నాయి. ఆ బ్యాంక్ పేరు క్రాంతి బ్యాంక్.
మల్కాజిగిరిలో క్రాంతి బ్యాంక్ కేంద్రంలోనే మల్లారెడ్డి వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఈ బ్యాంక్ చైర్మన్.. మల్లారెడ్డి వ్యాపారాల్లో భాగస్వామి అని తెలుస్తోంది. ఇందులోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి సమీప బంధువుల ఇళ్లలో దాచి ఉంచిన రూ. ఐదు కోట్ల వరకూ నగదును మాత్రం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదాల సమయంలో మల్లారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. అయనఫోన్ను ఐటీ అధికారులకు చిక్కకుండా.. తప్పించారు. అయితే పక్క ఇంట్లో ఓ గోనెసంచిలో ఉండగా ఐటీ అధికారులుఆ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
మల్లారెడ్డికి ఉన్న కాలేజీలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. ఇతరల ఆస్తుల గురించి లెక్కే ఉండదు. ఐటీ సోదాల్లో ఎంత దొరుకుతాయో కానీ.. పెద్ద ఎత్తున చర్యలు మాత్రం తీసుకోవడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. అయితే ఐటీ సోదాల్లో అరెస్టులు చేయడం అంటూ ఏమీ ఉండదు. ఫైన్స్ మాత్రం వేస్తారు. తీవ్రమైన నేరం బయటపడితేనే అరెస్టుల వరకూ వెళ్తారు. క్రాంతి బ్యాంక్ వ్యవహారాల్లో తేడా కనిపిస్తే మాత్రం… సరియస్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.