జగన్ పై తిరగబడాలని పిలుపునిచ్చిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావును కంట్రోల్ చేయలేనని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ హైకమాండ్‌కు నేరుగా మీడియా ద్వారా సందేశం ఇచ్చారు. వరుసగా రెండు రోజుల పాటు వసంత నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన మాట్లాడకుండా చూసుకోవాలని పార్టీ హైకమాండ్ నుంచి సందేశం వచ్చింది. దీంతో ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.. తన తండ్రి నోరే ప్రమాదకరమని ఆ.. వాగే నోరు,తిరిగే కాలు ఆగదన్నట్లుగా తన తండ్రి ని ఆపలేమని ఆయన తేల్చేశారు.
అయితే తన తండ్రి మాటలతో తాను ఏకీభవించడం లేదని ఆ విషయాలను ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెడ్డ పేరు తేకూడదనే విధంగా ప్రవర్తించేవాళ్ళమన్నారు. ఆయన నోరు చాలా ప్రమాదకరమన్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఇరకాటంలో పెట్టడం ఆయన నైజమని, ఈ విషయాన్ని ఏ ఒక్క వైయస్సార్ అభిమాని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు.
అయితే వసంత కృష్ణప్రసాద్‌పై జగన్ పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకే ఇతరుల్ని నియోజకవర్గంలో ప్రోత్సహిస్తున్నారు. ఈ అంశంపైనా వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. మైలవరం నియోజకవర్గం లో గందరగోళానికి కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయని .. సొంత పార్టీ వారే దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. మంత్రి జోగి రమేష్, తో విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు.