తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎక్కడా తగ్గేందుకు సిద్ధం కావడం లేదు. ఇద్దరు స్వామిజీలు మాట్లాడుకున్న మాటలు.. వారి ఫోన్ కాల్ రికార్డులు.. వారితో పరిచయాల ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అమిత్ షా కీలకపాత్ర పోషించారని.. పరోక్షంగా మీడియాకు లీక్ చేస్తున్నారు. ఈ కేసు స్టేటస్ ను మీడియాకు క్లుప్తంగా అనధికారికంగా తెలిపారు సిట్ అధికారులు. మొత్తం తొమ్మిది మందిపై ప్రస్తుతం సిట్ దృష్టి పెట్టింది. వీరిలో నోటీసులు జారీ చేసిన వారు కాకుండా.. ఆరెస్సెస్ నెంబర్ టు దత్తాత్రేయ హోస్బలే, హోంమంత్రి అమిత్ షా ప్రైవేటు కార్యదర్శి సాకేత్ కుమార్ కూడా ఉన్నారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో సిట్ వద్ద ఉన్న ఆధారాలు.. కేవలం కాల్ డేటా.. వాయిస్ రికార్డులు మాత్రమే. రామచంద్ర భారతి కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందని.. దత్తాత్రేయ హోస్బలే డబ్బులను ఆరెంజ్చేశారని అంటున్నారు. ఈ ఆపరేషన్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అమిత్‌షా కార్యదర్శికి రామచంద్రభారతి పంపారని పోలీసులుఅంటున్నారు. అమిత్ షాకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు.
అయితే కేవలం కాల్ రికార్డులు అంటూ దేశ హోంమంత్రికి నోటీసులు జారీ చేయడం ఎలా సాధ్యమని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐల దూకుడును తగ్గించడానికి .. ఇలా కౌంటర్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇలాంటి బెదిరింపులను.. బీజేపీ అగ్రనాయకత్వం ఎలా సహిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని వారు సీరియస్‌గా తీసుకుంటారని.. టీఆర్ఎస్ అగ్రనాయకత్వం మరికొన్ని లేనిపోని సమస్యలను తెచ్చుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.