సొంత పార్టీలు పెట్టి అధికారంలోకి వచ్చిన వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ తర్వాత తానేనని సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు తాను కితాబిచ్చుకున్నారు. ఇతరుల దగ్గర పార్టీలు లాక్కునేది చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో బహిరంగసభలు పెట్టడం.. డ్వాక్రా మహిళల్ని, వృద్ధుల్ని..పథకాల లబ్దిదారుల్నిసభలకు బలవంతంగా తీసుకురావడం.. వారందరికీ రాజకీయ ప్రసంగాలు చెప్పడం గత కొద్దిరోజులుగా కామన్ అయిపోయింది. సిక్కోలులోనూ జగన్ అదే పని చేశారు. రాజకీయ ప్రసంగంలో స్వకుచమర్ధనం కాస్త ఎక్కువగా చేసుకున్నారు. తనను ఎన్టీఆర్, ఎంజీఆర్‌తో పోల్చుకున్నారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్ ల రాజకీయం గురించి జగన్‌కు పూర్తిగా తెలుసో లేదో కానీ.. వారు పార్టీలు పెట్టుకుని అధికారంలోకి వచ్చారనే దాన్ని మాత్రమే తనకు అన్వయించుకున్నారు. వారేమీ ముఖ్యమంత్రుల బిడ్డలు కాదనే సంగతిని మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అనే మహా వృక్షం కింద.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదిగితే..ఆయన చనిపోయాడు.. అదే సందనుకుని ఆ కాంగ్రె్స పార్టీని కబ్జా చేసేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకుని.. ఆ కాంగ్రెస్ పార్టీని ఏలుతున్నారు.. జగన్మోహన్ రెడ్డి. సానుభూతి తప్ప మరో అస్త్రమే లేని రాజకీయం చేస్తూ.. ఎన్టీఆర్ , ఎంజీఆర్ తరహాలో తననూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్ కింది స్థాయి నుంచి సినిమా రంగంలో ఎదిగారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో పార్టీలు పెట్టారు. ఘన విజయం అందుకున్నారు. అంతే కానీ.. తండ్రి చనిపోయిన మరుక్షణం నుంచే.. చనిపోయిన వాళ్లను లెక్కలేసుకుని వారికి ఓదార్పు యాత్రంటూ తమ రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేసుకోలేదు. అంతకుమించి వారు పరిపాలనలోనూ ప్రజల మన్ననలు అందుకున్నారు. కుల, మత, ప్రాంత ద్వేషంతో రగిలిపోలేదు.
కారణం ఏమిటో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇటీవలి కాలంలో తనను తాను పొగుడుకోవాలని అనిపిస్తోంది. పార్టీ నేతలు చంద్రబాబును గట్టిగా తిడుతున్నారు కానీ..తనను పొగుడుతున్నట్లుగా ఆయనకు అనిపించడం లేదు. ఆ బాధ్యతను తానే తీసుకుంటున్నారు. ప్రతీ సభలోనూ.. తన కోసం కాసేపు కేటాయించుకుని పొగుడుకుంటున్నారు.