200 మందికిపైగా అధికారులు రెండు రోజుల నుంచి సోదాలు చేస్తున్నారు. అయినా ఎడతెగడం లేదు. గొలుసుకట్టులాగా.. ఒక దాని తర్వాత ఒకటి ఆస్తిపాస్తులు.. బినామీ ఆస్తుల పత్రాలు.. లాకర్లు.. బ్యాంక్ ఖాతాలు ఇలా వెలుగు చూస్తునే ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు ఐటీ శాఖలోని కొత్త నిపుణులు వచ్చి బృందాల్లో చేరుతున్నారు. పరిస్థితి చూస్తూంటే.. మరో ఒకటి.. లేదా రెండు రోజుల పాటు సోదాలు జరగవచ్చని ఐటీ అధికారులు చెబుతున్నారు. మల్లారెడ్డి, ఆయన కుమారులు, అల్లుడు.. వ్యాపార సంస్థల్లో బాధ్యతలు చూసేవారి వద్ద నుంచి ఇప్పటి వరకూ రూ. ఎనిమిదిన్నరకోట్ల నగదు స్వాధీనం చేసుకన్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ దొరికిన పత్రాలను పరిశీలించారు. ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను బయటకు తీస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి దగ్గర ఎక్కువ అనుమానాస్పద లావాదేవీలు గుర్తించారు. ఆయన ప్రస్తుతం దేశంలో లేరు. టర్కీలో ఉన్నారు. దీంతో లాకర్లు తెరిపించడం ఆలస్యం అవుతోంది. ఆయన కుమార్తెను తీసుకుని వెళ్లి లాకర్లను తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి మల్లారెడ్డి కుటుంబీకులు టెన్షన్లో ఉన్నారు.
మల్లారెడ్డి పెద్ద కుమారుడికి .. మరో బంధువుకు ఛాతినొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరారు. తన కుమారుడు వణికిపోతున్నాడని.. ఐటీ అధికారులు కొట్టారని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను ఐటీ అధికారులు పట్టించుకోలేదు. వారి సోదాలు వారు చేస్తున్నారు. సోదాలు ముగిసిన తరవాత.. సీబీడీటీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ సోదాల్లో ఎంత దొరికింది.. ఎంత పన్ను ఎగ్గొట్టారు.. అన్న అంశాలపై స్పష్టత రాదు. ఏమైనా హవాలా లాంటివి బయటపడితే.. మల్లారెడ్డికి ఈడీ చిక్కులు కూడా తప్పవు. అయితే మల్లారెడ్డి వ్యాపారాలు మొత్తం.. అంత పర్ఫెక్ట్గా ఏమీ ఉండవు కాబట్టి..ఆయన గట్టిగానే చిక్కుకుపోయారన్న వాదన టీఆర్ఎస్లోనే వినిపిస్తోంది.