ఐటీ,ఈడీ అధికారులు దాడులు చేస్తే ఎదురు దాడి చేయండని కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశంలో సలహా ఇచ్చారు. అచ్చంగా మంత్రి మల్లారెడ్డి దాన్ని ఆచరణలో పెట్టేశారు. దీంతో ఆయనపై ఐటీ అధికారులు కేసు పెట్టారు. ఐటీ అధికారిని మంత్రి బంధించారని.. తాము సేకరించిన డాక్యుమెంట్లను బలవంతంగా లాక్కుని చించేశారని.. సీజ్ చేసిన ల్యాప్ ట్యాప్‌ను కూడా తీసుకెళ్లిపోయారని ఐటీ అధికారులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఐటీ అధికారులకు సహకరించడమే కానీ ఇలా ఎదురుదాడి ఇంత వరకూ ఏ రాజకీయ నాయకుడూ చేయలేదు. అలా చేస్తే పరిస్థితి ఎలా మారిపోతుందో వారికి తెలుసు.
అయితే మల్లారెడ్డి కి మాత్రం కేసీఆర్ చెప్పిన మాటలు బాగా ధైర్యం తెచ్చినట్లుగా ఉన్నాయి. ఆయన ఐటీ అధికారులపై దాడులు.. ధర్నాలకు కూడా దిగుతున్నారు. అంతే కాదు.. పోలీసులు తమ వాళ్లేనన్న ధైర్యంతో ఎదురు ఫిర్యాదులు కూడా చేశారు. ఐటీ అధికారులు తమపై దాడి చేసి బలవంతంగా తప్పుడు లెక్కలతో తమ సంతకం తీసుకున్నారని మల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ ఫిర్యాదును దుండిగల్ పీఎస్ కు ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. మల్లారెడ్డి ఫిర్యాదుపై కేసు పెట్టారో లేదో బయటకు తెలియడం లేదు. రహస్యంగా ఉంచారు.
మరో వైపు.. ఐటీ సోదాల్లో మల్లారెడ్డితో పాటు ఆయన బంధువుల వద్ద సుమారు రూ. పది కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని వందల కోట్ల అవకతవకలు గుర్తించడంతో.. మల్లారెడ్డి తో పాటు ఇద్దరు కుమారులకు అల్లుడు రాజశేఖర్ రెడ్డి తో పాటు వియ్యంకుడు లక్ష్మా రెడ్డి కి ఐటీ నోటీసులు చేశారు. సోమవారం ఐటి కార్యాలయం ముందు విచారణ కు హాజరు కావాలని … తాము అడిగిన వివరాలన్నీ తీసుకు రావాలని ఆదేశించారు. మల్లారెడ్డి ఐటీ శాఖ అధికారులతో దురుసుగా వ్యవహరించడంతో వారు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.