ఏపీలో అయితే ఎన్టీఆర్ లేకపోతే చిరంజీవిని ఆకర్షించేద్దామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వడం లేదు. రాజకీయాలపై ఆసక్తితో గతంలో పార్టీ పెట్టి తప్పిదాలు చేసిన.. కనుమరుగైపోయిన చిరంజీవికి మళ్లీ లైఫ్ ఇస్తామన్న సంకేతాలను బీజేపీ చాలా కాలంగా పంపుతోంది. తాజాగా ఆయనకు అప్రకటిత వీఐపీ స్టేటస్ ప్రకటించి.. తమ వాడికి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చిరంజీవి ఏ మాత్రం మొగ్గు చూపినా.. బీజేపీ అగ్రనాయకత్వ అందుకుంటుంది. కానీ చిరంజీవికి చాలా పరిమితులు ఉన్నాయి. అందులో మొదటిది జనసేన పార్టీ. తమ్ముడికి ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అందుకే వేరే పార్టీలో చేరడం అసాధ్యమన్న సంకేతాలు పంపించారు.
చిరంజీవి కంటే ముందే బీజేపీ జూనియర్ ఎన్టీఆర్ పై దృష్టి పెట్టింది. కొన్నాళ్ల క్రితం అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించి మాట్లాడారు. ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు.కానీ సహజంగానే రాజకీయాలపై చర్చ వస్తుంది. అలా భేటీ ముగిసిన తర్వాత నుంచి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ తమకు ప్రచారం చేస్తారని ప్రకటించారు. సోము వీర్రాజు లాంటి నేతలు .. జూనియర్ ఎన్టీఆర్ తమకు స్టార్ క్యాంపెయినర్ అని ప్రకటించేసుకున్నారు. కానీ అమిత్ షా లాంటి పెద్ద మనిషి పిలిచినప్పుడు వెళ్లి కలవడం గౌరవం.. ఆ మేరకు వెళ్లాను..అంతకు మించి ఏం లేదన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ నింపాదిగా తన పని తాను చేసుకుంటున్నారు.
రాష్ట్రాల్లో బీజేపీ ఎదగాలంటే… ఇలాంటి సూపర్ స్టార్లను క్యాచ్ చేయాలని బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఆకర్షించింది తక్కువ. తమిళనాడులో రజనీకాంత్ ని కూడా ఒప్పించలేకపోయారు. ఏపీలో మరో ప్రయత్నం చేస్తున్నారు. కానీ బిజేపీ ఎంచుకున్న ఇద్దరు స్టార్లకు వారు ముందడుగువేయలేనంత రిజర్వేషన్స్ ఉన్నాయి. అయితే బీజేపీతో పొత్తులో ఓ సూపర్ స్టార్ ఉన్నారు. ఆయనేపవన్ కల్యాణ్, తాను సొంతంగా ఎదుగుతా అంటున్నారు కానీ.. పార్టీని విలీనం చేయడానికి అంగీకిరంచడం లేదు. అందుకే బీజేపీ పవన్‌ను పరిగణనలోకి తీసుకోలేకపోతోంది.