ప్రముఖ నటుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం ఆయన కు జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో చెన్నైలోని స్థానిక ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. ఆ తరవాత ఆయన డిశ్చార్జ్ కూడా అయ్యారని తెలుస్తోంది. బుధవారం ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ని కలుసుకొని, ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. రాత్రే చెన్నై వెళ్లిపోయారు. అయితే.. చెన్నై వెళ్లాక ఆయన అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని, కంగారు పడల్సిన అవసరం లేదని కమల్ సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల.. `విక్రమ్` సినిమాతో సూపర్ హిట్టు కొట్టి, మళ్లీ రేసులోకి వచ్చారు కమల్. ఇప్పుడు `భారతీయుడు 2` షూటింగ్లో బిజీగా ఉన్నారు.