ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల కిందటే ఏపీలో రిలయన్స్ సెలూన్స్‌కు పర్మిషన్ ఇచ్చిందన్న విషయం వెలుగులోకి రావడంతో నాయీబ్రాహ్మణులు ఆందోళనలు చేపడుతున్నారు. తమ పొట్టు కొట్టి రిలయన్స్‌కు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో చిన్న వ్యాపారాలు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అందులో కుల వృత్తులు ఎక్కువ. చేపల దుకాణాలు, మటన్ కొట్లు, సెలూన్స్, లాండ్రీ ఇలాపెద్ద ఎత్తున ఉపాధి పొందుతూ ఉంటారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మెల్లగా ఆయా వృత్తుల్లోకి కార్పొరేట్లను ఆహ్వానించడమో.. లేదా స్వయంగా తామే రంగంలోకి దిగి.. వ్యాపారం చేయడమో చేస్తోంది. ఈ క్రమంలో సెలూన్ వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఇప్పటికే మత్స్యకరాలు పొట్ట కొట్టేలా వివాదాస్పద జీవో తీసుకు రావడమే కాకుండా… ప్రత్యేకంగా ఔట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే విక్రయాలు చేపడుతోంది. దుకాణాలను.. మత్స్యకారులకు మాత్రమే కాకుండా ఎవరికి కావాలంటే వారికి కేటాయించి వ్యాపారం చేసుకునే చాన్సిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు నాయీ బ్రాహ్మణులను కూడా ప్రభుత్వం కార్పొరేట్ల దగ్గర కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఏ గల్లీలో చూసినా నాయీ బ్రాహ్మణుల దుకాణాలు ఉంటాయి. రిలయన్స్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తే వీరంతా.. ఆయా దుకాణాల్లో ఉద్యోగుల్లా చేరిపోవాల్సి వస్తుంది.
అందుకే కొద్ది రోజులుగా నాయీ బ్రాహ్మణులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాతం పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు రిలయన్స్ అంటే.. తమ తండ్రిని చంపించిన సంస్థ అన్నట్లుగా దాడులు కూడా చేయించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఆ సంస్థకు అనుకూలంగా మారిపోయారు. రాజ్యసభ సీటిచ్చారు. అంతకు మించి వ్యాపార ప్రయోజనాలు కల్పిస్తున్నారు. బీసీల పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోవడం ఇందులో ఉండటం.. మరింత ఆశ్చర్యకరం.