ఈమధ్య రవితేజ సినిమా అంటే… రీషూట్లకూ కొంత బడ్జెట్ కేటాయించుకోవాల్సివస్తోంది. ఎందుకంటే సినిమా అంతా పూర్తయ్యాక, మళ్లీ ఓసారి చెక్ చేసుకోవడం, తప్పొప్పులు సరి చేసుకోవడం కామన్ అయిపోయింది. అందులో భాగంగానే `ధమాకా`కీ రీ షూట్లు తప్పలేదని తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు.
తాజాగా ఆ సినిమాలో కొన్ని సీన్లు రీ టైట్ చేసి, రీ షూట్ చేసినట్టు సమాచారం. అందుకోసం ఓ కొత్త రైటర్ సహకారం కూడా తీసుకొన్నార్ట. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకొన్న `కార్తికేయ 2`లో కొన్ని సన్నివేశాలకు రచనా సహకారం అందించిన రైటర్… ధమాకా కోసం కూడా వర్క్ చేశాడని, ఆయన కొత్తగా రాసిన సన్నివేశాల్ని మళ్లీ తీశారని సమాచారం అందుతోంది. ఈసారి ఫైనల్ అవుట్ పుట్ చూసుకొని, రవితేజ సంతృప్తి వ్యక్తం చేశాడని, ఇప్పుడు ప్రమోషన్లకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారని సమాచారం.