నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యాల దొంగతనం కేసును హైకోర్టు సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దొంగతనం విషయంలో పోలీసులు ఏ మాత్రం సీరియస్గా వ్యవహరించలేదని.. చాలా సందేహాలు ఉన్నాయని జిల్లా జడ్జి హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించడం మంచిది అని సూచించారు. ఈ నివేదిక మేరకు విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం కూడా సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదని చెప్పడంతో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే.. కోర్టులో చోరీ జరిగింది. కాకాణి గతంలో మంత్రి సోమిరెడ్డిపై తప్పుడు .. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశారు. దానిపై సోమిరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో సాక్ష్యాలన్నీ తీసుకెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. కానీ సాక్ష్యాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయని కోర్టులో చోరీ అయిన వాటికి దానికీ సంబంధం లేదని చెబుతున్నారు. కానీ పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలు లేవు. ఇలా రకరకాలుగా ఈ కేసు వ్యవహారం మలుపులు తిరిగింది. చోరీ అయిన కేసులోని సాక్ష్యాలు కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఖచ్చితంగా శిక్ష పడే కేసుగా భావిస్తూండటంతో ఎక్కువగా ఆయన వైపే అనుమానంగా చూస్తున్నారు. దొంగలు ఎక్కడైనా విలువైన వస్తువులు ఎత్తుకెళ్తారని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని మరీ సాక్ష్యాలు తీసుకెళ్లడం ఏమిటన్న అనుమానం సహంజగానే వస్తుంది. వాటిని మటుకే తీసుకెళ్లి పనికి రాని వాటిని కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ఈ వ్యవహారం న్యాయవర్గాల్లోనూ కలకలం రేపింది.
ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే ముందుగా వేలి ముద్రలు, పాదముద్రలు సేకరిస్తారు. కానీ నెల్లూరు చోరీ ఘటనలో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కోర్టులో దొంగతనం అంటే చిన్న విషయం కాదు. పోలీసులు కనీస విచారణ జరపకుండా.. పాత నేరస్తుల్ని అరెస్ట్ చేసి.. పాత సామాన్ల కోసం వారే దొంగతనం చేశారని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఇది కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది.
కాకాణిపై కేసును గతంలోనే వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. సీబీఐకి హైకోర్టు ఇచ్చిన ఏ కేసులోనూ ఇంత వరకూ ఫలితం రాలేదు. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ కేసు.. న్యాయమూర్తులపై దూషణల కేసు.. వివేకానందరెడ్డి హత్య కేసు.. అలాగే అయేషా మీరా కేసు వంటి వాటిని సీబీఐ విచారణ జరుపుతోంది.