“శేషన్” లాంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్లీ ఎందుకు రాలేదు ? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే.. ఆయన స్థాయిలో మళ్లీ ఎన్నికల సంఘాన్ని .. నడిపించిన వారు లేరు. ఎన్నికల సంఘం అంటే.. ఎన్నికల నిర్వహణ సమయంలో సుప్రీం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి దేశానికి అచ్చమైన ప్రజా ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. అన్ని రాజకీయ పార్టీలు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించేలా చూడటమే కాకుండా.. నిరంతరం.. నిష్పక్షిపాతంగా నిర్ణయాలు తీసుకుని ప్రజలకు .. ప్రజాస్వామ్యానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. కానీ ఇటీవలి కాలంలో ఎన్నికల సంఘం తీరు .. పూర్తిగా వివాదాస్పదమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు చెప్పినట్లుగా ఈసీ చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. వారు కేవలం.. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలు అమలు చేస్తున్నారు కానీ రాజ్యాంగపరంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం లేదు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయకపోగా… మరింత బలహీనం చేస్తున్నారు.
వేర్వేరుగా హిమాచల్, గుజరాత్ ఎన్నికల షెడ్యూళ్లు – బీజేపీ కోసమే !
2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. కానీ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం మాత్రం మాత్రం ఎక్కువ మంది నరేంద్రమోదీకి ఇవ్వలేదు. ఆయనకు బదలుగుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఆ అవార్డుకు అర్హుడన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అధికారపక్షానికి అనుకూలంగా ఆయన చేసిన బ్యాటింగ్ ఫలితం ఏకపక్షంగా రావడానికి ఉపయోగిపడిందన్నమాట.. ఒక్క ఆ ఎన్నికలే కాదు… కొంత కాలంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘం పని తీరు ఎప్పటికప్పుడు వివాదాస్పదమవుతూనే ఉంది. కేంద్రంలో అధికారంలో బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని.. ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకుంటుందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. చివరికి నిన్నామొన్న .. హిమచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించాల్సి ఉండగా.. ముందుగా హిమాచల్ తేదీలు ప్రకటించారు. పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత కౌంటింగ్ డేట్ ప్రకటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు గుజరాత్ ఎెన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రెండూ ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నా.. బీజేపీకి ప్రచార వెసులుబాటు కల్పించడానికి అధికారంలో ఉన్నందున కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఎన్నికల సంఘం ఇలా చేసిందన్నది .. ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటిదేమీ లేదని ఈసీ చెప్పవచ్చుగాక.. కానీ అసలు ఉద్దేశం బీజేపీ కమాండ్‌కు అనుగుణంగా వ్యవహరించడమే. అందుకే దేశంలో ప్రజాస్వామ్య గమనంపై ఎప్పటికప్పుడు కొత్త చర్చ జరుగుతూనే ఉంది.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత ఎన్నికల సంఘానిదే !
భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రూపొందించినా.. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా, ఓటర్ల జాబితా రూపొందించినా ఆ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎన్నికల సంఘానికి అధికారాలు, బాధ్యతలు రాజ్యాంగబద్ధంగా వున్నాయి. కానీ, తనకంటూ విడిగా ఒక కార్యనిర్వాహక వ్యవస్థ లేదు. ఆయా ప్రభుత్వాల యంత్రాంగం మీద ఆధారపడి తన పనులను చక్కబెట్టుకోవాల్సిన పరిస్తితే ప్రస్తుతం వుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంత కాలం ఎన్నికల సిబ్బందిగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఆ కొద్ది రోజులు ఎన్నికల సంఘం కనుసన్నల్లోనే పనిచేయాలి. కోడ్ వ్యవధానం ముగియగానే తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. ఈ కారణంగా వాళ్ళు నిర్భయంగా, నిస్సంకోచంగా రాజకీయాలకు అతీతంగా, ప్రలోభాలకు లొంగిపోకుండా, ఒత్తిళ్లకు గురికాకుండా విధులు నిర్వర్తించడం అనేది కత్తిమీద సామే. వారందరూ అలాగే నిబద్ధతతో పనిచేస్తారని అనుకోవడం కూడా అనుమానమే. అచ్చంగా ఎన్నికల కమిషనర్లు కూడా అదే జాబితాలోకి చేరిపోవడం ఇక్కడ విషాదం.
సుప్రీంకోర్టూ జోక్యం చేసుకోలేనంత పవన్ ఎన్నికల సంఘానిది.. కానీ ఏం జరుగుతోంది ?
గ్రామస్థాయిలో పంచాయతీ ఎన్నికలు మొదలుకొని దేశస్థాయిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల వరకు పదుల సంఖ్యలో వాహన శ్రేణులు, రాత్రింభవళ్లు తేడా లేకుండా హోరెత్తించే ప్రచారాలు, లౌడ్ స్పీకర్ల హోరు, గోడలపై రాతలు, గుట్టలు గుట్టలుగా తమ నేతలను బలపరుస్తూ ప్రచార పత్రాలు ఇదంతా 1990కి ముందు ఎన్నికలు జరిగే తీరు. ఎన్నికలంటే శేషన్‌కు ముందు.. శేషన్‌కు తర్వాత అన్నంతగా ఎన్నికల నిర్వహణలో మార్పులు చేస్తూ అప్పట్లో హుకూం జారీ చేసి పోటీల్లో నిలిచే అభ్యర్థుల పట్ల సింహస్వప్నంలా మారి నిబంధనల కొరడా ఝులిపించారు. ప్రస్తుతం వీటన్నింటికి కళ్లెం వేసి అభ్యర్థుల హంగామాకు, ఎన్నికల ఖర్చుకు ముకుతాడు వేసిన ఘనత 1990 నుంచి 1996 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన టీఎన్ శేషన్‌కే దక్కుతుంది.ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎన్నికల వ్యయానికి జమ, ఖర్చు చెప్పాలని, నిర్ణీత పరిమితికి మించి ఖర్చు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారంలో వినియోగించే వాహనాల ఖర్చు, కార్యకర్తల భోజనాల వ్యయం, పార్టీ ప్రచార ఖర్చు కట్టుదిట్టం చేశారు. వాహనాలకు జెండా కట్టాలంటే, మైక్ పెట్టాలంటే అనుమతి తప్పనిసరి చేశారు. ప్రచారంలో సమయ పాలన, ప్రత్యేకించి రాత్రి సమయాల్లో లౌడ్ స్పీకర్ల హోరెత్తించే ప్రచారం, గోడలపై రాతలు కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శేషన్ తన పదవీకాలంలో ప్రధాన మంత్రి నరసింహారావు నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అహ్మద్, బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వరకూ ఎవరినీ వదల్లేదు. ఆయన బిహార్‌లో మొదటిసారి నాలుగు దశల్లో ఎన్నికలు జరిగేలా చేశారు. ఆ నాలుగుసార్లూ ఎన్నికల తేదీలు మార్చారు. బిహార్ చరిత్రలోనే అవి సుదీర్ఘ ఎన్నికలుగా నిలిచాయి. ఎన్నికల కమిషన్‌ను ‘సెంటర్ స్టేజ్’ పైకి తీసుకురావడంలో శేషన్ చాలా కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి ఊరూపేరూ లేకుండా ఉండేది. కానీ శేషన్ ఆ పదవి పవర్‌ను బయటకు తీసుకు వచ్చారు. ఒక్క సారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత దేశ వ్యవస్థ మొత్తం.. ఎన్నికలసంఘం చేతుల్లోకి వెళ్తుంది. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు.
రాజ్యాంగం బలమైన వ్యవస్థలను ఇచ్చింది .. కానీ వాటికి నేతృత్వం వహించే వారు ఆ స్ఫూర్తితో ఉంటున్నారా?
దేశ ప్రజాస్వామ్యం అత్యున్నతమైనది. ప్రతి ఒక్క వ్యవస్థకు చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండేలా రాజ్యాంగం రూపొందించారు. ఎన్నికల్లో గెలిచామని సర్వ శక్తి సంపన్నులమని.. శాసనవ్యవస్థ..అధికార పార్టీ అనుకోలేదు. శాసన వ్యవస్థను నియంత్రించే అధికారం న్యాయవ్యవస్థకు ఉంటుంది. ఇందులోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు అపరిమితమైన అధికారాలుంటాయి. అయితే అవన్నీ చట్టం, రాజ్యాంగ పరంగానే ఉంటాయి. ఎన్నికల కమిషన్ కూడా అంతే. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వ్యవస్థ మొత్తం అదుపులో ఉంటుంది. ఎన్నికలు స్వేచ్చగగా జరగడానికి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. కానీ ప్రతీ సందర్భంలోనూ.. మనం చెప్పుకుంటున్న పవర్ ఫుల్ రాజ్యాంగ వ్యవస్థకు ఎవరు నేతృత్వం వహిస్తున్నారన్నదే అక్కడ కీలకం. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించి.. దేశానికి తనదైన సేవ చేయాలనుకునే శేషన్ లాంటి అధికారుల వల్ల ఆ వ్యవస్థలు ఎంత బలంగా ఉన్నాయో ప్రజల ముందు సాక్షాత్కరిస్తాయి. కానీ వెన్నుముక లేని వారి వల్ల సమస్యలు వస్తాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తమను నియమించిందని.. వారికి అనుకూలంగా వ్యవహరించడం తమ ధర్మమని అనుకునేవారితోనే ప్రజాస్వామ్యానికి పెను ముప్పు ఏర్పడుతోంది. దురదృష్టవశాత్తూ.. శేషన్ తర్వాత అలా అనుకునే వారే సీఈసీలు అవుతూ వస్తున్నారు. రాను రాను ఆ ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇవాళ అవి మరీ అధంపాతాళానికి పడిపోయాయి. అందుకే ఎన్నికల సంఘంపై.. ఏ ఒక్క విపక్ష పార్టీ నమ్మకం పెట్టుకోవడం లేదు. పెట్టుకోవాలని కూడా ఈసీ అనుకోవడం లేదు. తాము చేయాలనుకున్నది చేసుకుంటోంది. ఎన్నికల నిర్వహణ అనేది రాజకీయ పార్టీలు.. ప్రజలకు ఎంత నమ్మకంగా జరిగితే.. ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. కానీ ఎన్నికల ప్రధానాధికారులు ఈ విషయాన్ని గుర్తించడానికి కనీసం అంగీకరించలేకపోతున్నారు.
ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు సహజం – పోటీలో ఉన్న ఓ పార్టీ వైపే నిర్ణయాల మొగ్గు !
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఎంత టూమచ్‌గా ఉందో… తర్వాత ఎన్నికల అధికారి చెప్పిన సారీని బట్టి అర్థం అయిపోతుంది. దాదాపుగా 40 లక్షల ఓట్లు గల్లంతయిన మాట నిజమేనని తరవాత ఆయన ఆయన సారీ చెప్పారు. కానీ ఇక్కడ జరగాల్సింది జరిగిపోయింది.. ఆ సారీతో అయ్యేది.. పొయ్యేది ఏమీ ఉండదు. అప్పట్లో టీఆర్ఎస్ బీజేపీతో సన్నిహితంగా ఉంటోంది. ఆ పార్టీ సహకారంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లింది.. అందులో మరో డౌటే అక్కర్లేదు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఈసీ తీరు ఎంత వివాదాస్పదం అయిందో చెప్పాల్సిన పని లేదు. ఏపీలో అయితే సీఎస్‌ను కూడా మార్చేసి.. పరిపాలనను పక్క పార్టీ చేతిలో పెట్టేసింది ఈసీ. అసలు ఎన్నికల నిర్వహణను.. అప్పటి సీఈవో ద్వివేదీ చేతి నుంచి సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం అనదికారికంగా తీసేసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంత వివాదాస్పదం అయ్యాయో చెప్పాల్సిన పని లేదు. ఎంత దారుణం అంటే.. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ .. ఎన్నికల కమిషన్ ద్వారా అధికారుల్ని ఇష్టారాజ్యంగా బదిలీ చేయించగలిగింది.. అనువైన అధికారుల్ని పోస్టింగ్ వేయించుకుంది.. ఎన్నికల ఫలితాలకు ముందే పాలన చేసిందంటే…తప్పేం లేదు. ఇది ఒక్క ఏపీలోనే కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ అంతే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. ఆ పార్టీకి దగ్గరగా ఉండేవారి కోసం.. ఎన్నికల సంఘం నిస్సంకోచంగా… నిర్ణయాలు తీసుకుంది. ఎవరేమనుకుకున్నా స్పందించలేదు.
సుప్రీంకోర్టు సీఈసీ నియామక ప్రక్రియను మార్చేస్తే.. అంత కంటే ప్రజాసవామ్య బలోపేత చర్య మరొకటి ఉండదు..!
కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమించే ప్రక్రియపై ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ)నియామకాలకు కొలీజియం వంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి అంశంపై దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు సమయం ఇచ్చింది. ఈసీ, సీఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా..? వద్దా..? అన్న దానిపై త్వరలో తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు మరో నాలుగైదు నెలల సమయం తీసుకున్నా.. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లను నియమించే ప్రక్రియను పక్కాగా మార్పు చేస్తే.. అది పెద్ద సంస్కరణ అవుతుంది. శేషన్ లాంటి ఫియర్ లెస్.. నిస్వార్థమైన అధికారులు.. ఎన్నికల సంఘాన్ని లీడ్ చేస్తే.. దేశ ప్రజాస్వామ్యాన్ని అంత కంటే మరి ఏ శక్తి బలోపేతం చేయలేదు. ఎందుకంటే.. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికలే ప్రాణం. దాన్ని రక్షించాల్సిన డాక్టర్ లాంటి సీఈసీ … అధికార పార్టీలతో కుమ్మక్కయితే.. ఆ ప్రాణంలో జీవం లేకుండా పోతుంది. దేశం ప్రమాదంలో పడుతుంది. మెల్లగా దేశం ఆ దిశగా వెళ్తోంది. సుప్రీంకోర్టే ప్రమాదాన్ని నివారించాల్సి ఉంది.