ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారశైలి ఎప్పుడూ వివాదాస్పదమే. పారదర్శక పాలన అంటారు కానీ.. ఏ సమాచారమూ బయటకు రాదు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలోనూ అంతే. ఆ శాఖలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు వీఆర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధ్యతల్ని ఒకరికే రెండు, మూడు చోట్ల పంచుతున్న ప్రభుత్వం కొంత మంది అధికారును ఏళ్ల తరబడి వీఆర్లో ఉంచుతూ వస్తూండటం ఆ శాఖలోనే చర్చనీయాంశం అవుతోంది.
ఎస్ఐ, సీఐ, డీఎస్పీల స్థాయిలో వీఆర్లో ఉన్న పోలీసుల అధికారుల సంఖ్య తక్కువేమీ కాదని.. కానీ సర్వీస్ రూల్స్ కారణంగా ఏ ఒక్కరూ బయటపడలేకపోతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం పోలీసు శాఖలో ఒక్క సామాజికవర్గానికే పెత్తనం ఇచ్చింది. వారు మాత్రం కీలక పోస్టుల్లో ఉన్నారు. ఎప్పుడు బదిలీలు..పోస్టింగ్లు.. ప్రమోషన్లు ఇచ్చినా… ఆ వర్గానికే ప్రాధాన్యం లభిస్తోంది. అదే సమయంలో సహజంగానే ఇతర వర్గాలన్నీ వివక్షకు గురవుతున్నాయి. ఈ సామాజికవర్గాలకు చెందిన కొంత మంది సిన్సియర్ అధికారులు చాలా కాలం నుంచి వీఆర్లో ఉన్నారు.
ప్రధానంగా రెండు, మూడు సామాజికవర్గాలకు చెందిన అధికారులను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్నికల నియామకాలు ఇప్పటికే ప్రారంభించినందున వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీఆర్లో ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. వీఆర్లో ఉంచుతున్న వారికి పూర్తి స్థాయిలో జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో ఆ పోలీసు కుటుంబాలు తీవ్ర వేదనకు గురవుతున్నాయి. గతంలో ఓ సారి తీవ్ర విమర్శలుు రావడం కోర్టు వరకూ వెళ్లడంతో కొంత మందికి హడావుడిగా పోస్టింగ్లు ఇచ్చారు. తర్వాత పరిస్థితి మళ్లీ మారిపోయింది.
పోలీసు వ్యవస్థను రాజకీయాల్లో భాగంగా చేసుకోవడం వల్లనే ఈ సమస్య వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం కీలక పొజిషన్లు ఇచ్చిన వారు చట్టాన్ని అతిక్రమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ పని చేయలేని వారు వీఆర్లో మగ్గిపోతున్నారు. ఇది వ్యవస్థను కించపర్చడమే. కానీ పోలీసు అధికారుల సంఘాలకు కూడా ఇది కనిపించడంలేదు.