వైసీపీ బీసీ నేతలను మళ్లీ రోడ్డెక్కించేందుకు జగన్ సిద్ధమయ్యారు. గతంలో టీడీపీ మహానాడు సమయంలో సామాజిక న్యాయం చేశామని బస్సు యాత్ర చేయించారు. ఆ సమయంలో జగన్ మాత్రం విహారయాత్రకు వెళ్లారు. మరోసారి బీసీ నేతలతో సభలు, సమావేశాలు.. కుల సంఘాలతో ఆత్మీయ భేటీలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన ఆలోచనను పంచుకునేందుకు .. ఎగ్జిక్యూట్ చేసే ప్రణాళికను వివరించేందుకు శనివారం వైసీపీకి చెందిన తొమ్మిది మంది ముఖ్య బీసీ నేతలకు ఆహ్వానం పలికారు. శనివారం మధ్యాహ్నం ఈ తొమ్మిది మంది నేతలతో జగన్ చర్చించనున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సందేశాన్ని అందుకున్న వారిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కొలసు పార్థసారథి, మాజీ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరందరితో ఓ టీమ్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాలను ఆకట్టుకునే రౌండ్ టేబుల్ భేటీలు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది.
అయితే వైసీపీలో ఇప్పుడు ఏ వ్యవస్థలో చూసినా రెడ్ల ప్రస్థానమే కనిపిస్తోంది. చివరికి ప్రాంతీయ సమన్వయకర్తలుగా రెడ్డియేతర నేతలను నియమించిన చోట కూాడ.. అదనగంా రెడ్డి నేతల్ని నియమించారు. వారు హైకమాండ్‌కు సన్నిహితులు కావడంతో వారి మాటే చెల్లుబాటవుతుంది. ఇక నామినేటెడ్ పోస్టుల్లో మాత్రమే కాదు.. చివరికి అధికార యంత్రాంగంలోనూ ఎక్కడా బీసీలకు చోటు లభించడం లేదు. చివరికిపార్టీలో కూడా గెలిస్తే పదవులు ఇస్తామని మభ్యపెట్టి పనులు చేయించుకుంటున్నారు కానీ ప్రాధాన్యత దక్కడం లేదు. అయినా వారిని మరోసారి రోడ్డెక్కించి.. సామాజిక న్యాయం చేశామని చెప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.