ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ పదవి కాలం నెలాఖరుతో ముగుస్తోంది. మరో ఏడాది పదవీ కాలం పొడిగింపు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రచారం జరిగినప్పటికీ అలాంటిదేమీ లేదని తేలింది. సమీర్ శర్మ కూడా ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో రిటైర్మెంట్‌కే మొగ్గు చూపారు. ఇప్పుడు కొత్త సీఎస్‌ను జగన్ ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన పూర్తిగా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పేరును ఖరారు చేశారని.. ఎప్పుడైనా ప్రకటించవచ్చని అంటున్నారు.
గతంలో పెద్దగా ప్రాధాన్య పోస్టుల్లో పని చేయని జవహర్ రెడ్డికి జగన్ సర్కార్ వచ్చిన తర్వాత దశ తిరిగిపోయింది. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మొత్తం ఆయన గుప్పిట్లో ఉంది. మొత్తం ఆయనే డీల్ చేశారు. తర్వాత తనకు టీటీడీ చైర్మన్ కావాలని ఉందని చెప్పి కొంత కాలం ఆ పోస్టుకు వెళ్లారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం.. ఎక్కువ రోజులు అక్కడ ఉంచలేదు. మళ్లీ సీఎంవోకు తీసుకొచ్చి కీలక బాధ్యతలిచ్చారు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా చేయబోతున్నారు.
శ్రీలక్ష్మికి చీఫ్ సెక్రటరీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఇటీవల గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసుల్లో ఆమెపై కేసులను హైకోర్టు కొట్టేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అలాగే ఉన్నాయి. అందుకే ఆమె పేరును పరిశీలించలేదని చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల వరకూ జవహర్ రెడ్డినే సీఎస్‌గా ఉంటారు. ఇది చాలా అత్యవసరమని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. ఓ రకంగా సామాజిక న్యాయం కూడా పూర్తయినట్లు అవుతుంది. ఎందుకంటే సీఎంతో పాటు ప్రభుత్వాన్ని నడిపే సజ్జల రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి లకు తోడు ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి జత అవుతారు. మొత్తంగా తమ సామాజికవర్గానికి సంపూర్ణ న్యాయం చేసుకున్నట్లవుతుంది.