వైసీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడా లేనంత చిక్కొచ్చి పడింది. నియోజకవర్గంలో సంపాదించుకోవడానికి ఇసుక లాంటి వనరులు కూడా లేకుండా అంతా పై స్థాయిలోనే పని కానిచ్చేస్తున్నారు. పోనీ ఏదైనా పనులు చేద్దామంటే…పెట్టుబడి పెడితే గోడకు కొట్టిన సున్నమే అవుతుందని భయపడుతున్నారు. పోనీ ప్రజల్లో ఏమైనా పలుకుబడి ఉందా ఉంటే.. వాలంటీర్ దగ్గరకు వెళ్తున్న జనం ఎమ్మెల్యే వద్దకు రావడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే.. బాగా పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తానంటూ… పార్టీ వైపు నుంచి బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. బాగా పని చేయడం ఏమిటో ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు.
అయినా సరే సీఎం జగన్ చెప్పాలని ఇంటింటికి వెళ్తున్నారు. ప్రజలు నోరు తెరవకుండా పెద్ద ఎత్తున జనం.. పక్కన పోలీసుల్ని కూడా పెట్టుకుంటున్నారు. అయినా నిరసనలు తప్పడంలేదు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలకు పర్యవేక్షకుల్ని పెడతానని జగన్ హెచ్చరిస్తున్నారు. లిస్ట్ ఖరారయిందని పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా లీకులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల పట్ల, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ఆశించిన ఫలితాలు రాని వారిని గుర్తించి, ఆయా స్థానాల్లో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తామని కొన్నాళ్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా టిక్కెట్లు నిరాకరించాలనుకున్న చోట్ల బలమైన పర్యవేక్షకుల్ని.. అవసరం లేని చోట.. ఆయా ఎమ్మెల్యేలు సూచించే వారినే పర్యవేక్షకులుగా పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో తమపై ఎంత అసంతృప్తి ఉందో ఎమ్మెల్యేలకు తెలిసొచ్ిచంది. ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలు, అమలు ఇలా అన్ని విషయాలు ఎమ్మెల్యేలను చుట్టుముట్టాయి. వాటిని అదిగమించి, ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇదే సమయంలో నియోజకవర్గాలకు పర్యవేక్షకుల నియామకం అంటూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తాం.. లేకపోతే లేదన్నట్లుగా ఎమ్మెల్యేలు కాడి దించేసే పరిస్థితికి వస్తున్నారు.