కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. ముఖ్యంగా అప్పులు పుట్టకుండా వేధిస్తోంది. తెలంగాణ సర్కార్ బడ్జెట్లో రుణాల రూపేణా రూ. రూ. 53,970 కోట్లు సమకూర్చుకోవాలని ఎఫ్ఆర్బీఎం లెక్కల ప్రకారం అంచనా వేసింది. కానీ కేంద్రం ఇప్పటి వరకూ ఇరవై వేల కోట్ల వరకే పర్మిషన్ ఇచ్చింది. ఇక ముందు ఇచ్చేది లేదంటోంది. దీనికి కారణం గతంలో కార్పోరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులు కూడా సర్కారుకు తీసుకున్న అప్పుల కిందే జమ కడుతామని కేంద్రం కొత్త రూల్ తేవడమే. దాని ప్రకారం అదనపు అప్పులకు తెలంగాణకు అర్హత లేకుండా పోయింది. తెలంగాణ ఇప్పటి వరకూ రూ. లక్ష కోట్లకుపై గ్యారంటీ రుణాలు తెచ్చుకుంది.
గతంలో మంజూరైన కాళేశ్వరం రుణాలు కూడా ప్రస్తుతం ఆగిపోయాయి.అందుకే కేసీఆర్ కేంద్రంపై మండి పడుతున్నారు. కేంద్రం తీరు వల్ల 40వేలకోట్లు రావడం లేదని అంటున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకుంటున్నారు. కార్పొరేషన్ల పేరుతో గ్యారంటీలు ఇచ్చి బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. సొంత పన్నుల ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీలు ఇచ్చుకోవచ్చునన్నది నిబంధన కాగా, గతేడాది దీనిని 180 శాతంగా పెంచుతూ ఏపీ సొంత నిర్ణయం తీసుకుంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల విలువ ఏకంగా రూ. 91,330 కోట్లుగా ఉంది.
ఏపీలో అయితే.. . ఆరు నెలల్లో దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అప్పు చేసింది. కేంద్రం.. ఏపీ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఏడాది మొత్తం 48వేల కోట్ల అప్పు చేస్తామని బడ్జెట్లో ఏపీ పెడితే.. ఆరు నెలలకే 49వేల కోట్ల అప్పు చేసింది. ఇంకా అదనపు అప్పుల కోసం కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో పదిహేను వందల కోట్లకు తాజాగా అప్పునకు పర్మిషన్ ఇచ్చింది. ఆర్బీఐ వద్ద బాండ్ల వేలం వేసి తెచ్చుకుని జీతాలకు సర్దుబాటు చేసుకోబోతున్నారు. కానీ తెలంగాణకు మాత్రం చాన్సివ్వలేదు.
వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలకు.. తప్పని సరి చెల్లింపులకు పోతూండటంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు తంటాలు పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. అయితే కేంద్రం చల్లని చూపు ఉండటంతో ఏపీకి సమస్యలు రావడం లేదు. తెలంగాణ మాత్రం చక్రబంధంలో ఇరుక్కుంది.