వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎక్కడి వరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. సీబీఐ బృందాలు ఏం చేస్తున్నాయో తెలియదు. విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో రిజర్వ్‌లో ఉంది. అక్టోబర్ 21న తీర్పు చెబుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది కానీ.. నెల దాటినా తీర్పు ఇంకా వెల్లడి కాలేదు. ఈ లోపు పులివెందులలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జైల్లో ఉన్న ఏ 5 నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య స్టేట్‌మెంట్‌ను పులివెందుల జడ్జి నమోదు చేశారు.
తొమ్మిదినెలల కిందట శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో ఓ పిటిషన్ వేశారు. అసలు వివేకాను హత్య చేసింది ఆయన కుమార్తె, అల్లుడేనని ఆరోపిస్తూ.. అసలు హత్య ఎలా జరిగింది… ఎవరెవరు ఫోన్లు మాట్లాడుకున్నారు.. ఇలాంటివి వివరిస్తూ.. ఓ పిటిషన్ వేశారు. తొమ్మిది నెలల పాటు ఆ పిటిషన్ గురించి పులివెందుల కోర్టు పట్టించుకోలేదు. అయితే హఠాత్తుగా పిలిచి.. స్టేట్‌మెంట్ నమోదు చేశారు. వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుని.. ఆస్తిని వాళ్లకు రాసిస్తామని చెప్పడం వల్ల కుటుంబసభ్యులే హత్య చేశారని తులశమ్మ పిటిషన్‌లో పేర్కొన్నారు.. వాంగ్మూలం కూడా అదే ఇచ్చి ఉంటారు.
అయితే అసలు సీబీఐ విచారణలో ఉన్న కేసులో పులివెందుల కోర్టు… వెళ్లి సీబీఐకి చెప్పాలని చెప్పకుండా ఎందుకు స్టేట్‌మెంట్ రికార్డు చేసిందనేదానిపై న్యాయవర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. విచారణను ఇతర రాష్ట్రానికి తరలిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.. తీర్పు వచ్చే దశలో ఎందుకు స్టేట్‌మెంట్ రికార్డుచేయడం ద్వారా ఏం చేయబోతున్నారన్నది కూడా సస్పెన్స్‌గా మారింది. మొత్తంగా చూస్తే.. వివేకా కేసులో బాధితుల్నే నిందితులుగా మార్చేందుకు కుట్ర ఓ రేంజ్‌లో జరుగుతోందన్న అనుమానం మాత్రం బలపడుతోంది.