తెలంగాణలో టీడీపీకి అంతో ఇంతో పట్టు ఉన్న జిల్లాగా ఖమ్మానికి పేరు ఉంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ఖమ్మం నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మంలో డిసెంబర్ 21న భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతారని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత బస్సు యాత్ర చేస్తామని అంటున్నారు. ఖమ్మం టీఆర్ఎస్లో లీడర్లు ఎక్కువైపోయారు. బీజేపీకి లీడర్లు లేరు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉంది. టీఆర్ఎస్ నుంచి కొంత మంది ముఖ్య నేతలు వచ్చే ఎన్నికల కల్లా ఇతర పార్టీల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంది.
లేకపోతే అందరికీ టిక్కెట్లు దక్కవు. అందుకే కొంత మంది నేతల చూపు టీడీపీ వైపు ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత భరోసా ఇచ్చే లీడర్ టీడీపీ తరపున ఉంటే.. టీడీపీ క్యాడర్ మొత్తం మళ్లీ ఆ పార్టీ వైపునకు వస్తుందన్న అంచనాల్లో తెలంగాణ టీడీపీ నేతలున్నారు. అంత తేలిగ్గా.. వదిలే ప్రసక్తి లేదని.. తెలంగాణనూ.. తమదైన ముద్ర వేస్తామని టీ టీడీపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో చంద్రబాబు అడుగుపెడితే కేసీఆర్ మళ్లీ దాన్ని సెంటిమెంట్‌కు వాడుకునే అవకాశం ఉంది. అందుకే ఆయన ఈ సారి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ కూడా యాక్టివ్ అయితే.. సమీకరణాల్లో ఎంతో కొంత మార్పులు చేసుకోవడం ఖాయమని అనుకోవచ్చు.