మార్గదర్శిలో సోదాలు నిర్వహించి అంబటి రాంబాబు వంటి వారితో అక్రమాలంటూ ప్రచారం చేయించి.. హడావుడి చేసినా ఈనాడులో మార్పు రాకపోగా.. ఏపీ సర్కార్కు బెల్టు దెబ్బకొడుతున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ ఆదివారం బెల్టు షాపులపై ఈనాడు ఇచ్చిన కథనం ప్రభుత్వ పరువును నడిరోడ్డుపైన పడేసింది. ప్రభుత్వం అనడం కన్నా.. జగన్ పరువు అనొచ్చు. ఎందుకంటే బెల్టు షాపుల గురించి గతంలో ఆయన చెప్పిన మాటలు.. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితిని కళ్లకు కట్టేలా చూపించి… జగన్ ఎంత పనికి మాలిన పాలకుడో ప్రజల ముందు ఉంచింది.
మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే.. వారు అమ్మకాల టార్గెట్ పెట్టుకునేందుకు తమ దుకాణం పరిధిలో బెల్టు షాపులు పెట్టుకుంటారు. కానీ ప్రభుత్వమే నిర్వహిస్తే బెల్టు దుకాణం ప్రస్తావనే రాదు అని జగన్ చెప్పేవారు. ఇప్పుడు ప్రభుత్వనే దుకాణాలు నిర్వహిస్తోంది. మరి బెల్టు దుకాణాలు లేవా ? అంటే.. అడుగుకో బెల్టు దుకాణం ఉందని ఈనాడు తేల్చింది. కిరాణా దుకాణాల దగ్గర్నుంచి వైసీపీ నేతలు.. వేలం పాటలు వేసి మరీ బెల్టు దుకాణాలు తెరిచిన వైనాన్ని చిత్రాలతో సహా వెల్లడించింది. ఈ కథనం చూసి వైసీపీ నేతలుకూడా సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది.
జగన్ చెప్పేది ఏదీ చేయరని… ప్రజల్ని మోసం చేయడంలో ఆయన ముందు ఉంటారని అనేక అంశాల ద్వారా వెల్లడయింది. మద్యనిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి..అదే మద్యం పేరుతో పేదల్ని నిలువుదోపిడి చేస్తున్న జగన్ సర్కార్.. ఇప్పుడు మద్యాన్ని వారింటి ముందుకే తెచ్చి పెడుతోంది. కొంత మంది పేదలకు బెల్టు దుకాణాల్లో ఉదయం అప్పుగా పెగ్గులు ఇచ్చి.. సాయంత్రం డబ్బులు వసూలు చేస్తున్న వైనం మరింత విషాదకరం.
ఈనాడును ఎంత బెదిరించాలన్నా… ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు ఈనాడు ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పై విరుచుకుపడుతోంది. అబద్దాలని ఎంత చెప్పినా వైసీపీ నమ్మించలేని స్థితికి చేరుతోంది.ఎందుకంటే.. అన్నీ ప్రజల కళ్ల ముందు ఉండే వాస్తవాలే.