వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మొదలు.. అన్ని కీలక పదవుల్ని రెడ్లకే కేటాయించింది. అది ప్రభుత్వం కావొచ్చు.. పార్టీ కావొచ్చు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలందరూ రెడ్లే. ఒక్క బొత్స మాత్రమే మినహాయింపు. రెండు, మూడు చోట్ల ఇతరులను నియమిస్తే.. వారికి తోడుగా రెడ్లను నియమించారు. పార్టీలో అన్ని స్థాయిలో రెడ్ల పెత్తనమే కనిపిస్తుంది. రాజకీయ ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడానికి మాత్రమే ఇతర వర్గాలను వాడుకుంటారు. అదే రెడ్లు మాత్రం పద్దతిగా ఉంటారు. ఎవరూ బూతులు అందుకోరు.
పాలనలో బీసీలు పేరుకే.. చక్రం తిప్పేదంతా ఓ వర్గమే !
ప్రభుత్వంలోనూ అంతే. ప్రభుత్వంలో బీసీ మంత్రులు ఎప్పుడైనా సొంతంగా సమీక్ష చేయడం చూశారా ? చాన్సే లేదు. వారు సచివాలయాల్లోనూ కనిపించరు. ఎందుకంటే.. వారికి పదవి మాత్రమే ఉంది. అసలు పనులన్నీ.. సకలశాఖా మంత్రి అయిన సజ్జల రెడ్డి చేస్తారు. ప్రభుత్వాన్ని నడిపే ఉన్నతాధికారుల్లో ఒక్క బీసీ అధికారి ఉండరు. అందరూ రెడ్లే. ప్రమోషన్లు పద్దతి ప్రకారం రావాల్సిన వారికీ అన్యాయం జరుగుతోంది. సీనియార్టీ జాబితాలో12వ స్థానంలో ఉన్న కసిరెడ్డి రాజేంద్రథనాథ్ రెడ్డి డీజీపీ అయ్యారు. మరి ఈ మధ్యలో ఉన్న ఇతర కులాల అదికారులు చేతకాని వాళ్లా ? డీఎస్పీల సంగతే చూసుకున్నా అంతే. బీసీలకు ఎక్కడా పవర్ ఉండే బాధ్యతలు ఇవ్వలేదు. ఎక్కడైనా తప్పనిసరిగా పోస్టింగ్ ఇస్తే.. వారిపై మరొకర్ని .. వేరే హోదాతో నియంత్రించి పని లేకుండా చసి అవమానించడం చేసుకున్నారు.
నామినెటెడ్ పోస్టుల్లో విధులు..నిధులు ఉన్నపోస్టుల్లో బీసీలెంత మంది ?
చివరికి నామినేటెడ్ పోస్టుల్లోనూ అంతే. యూనివర్సిటీ వీసీలు..పాలక మండళ్ల దగ్గర్నుంచి టీటీడీ చైర్మన్ వరకూ అన్నింటిలోనూ సింహభాగం రెడ్లకే దక్కుతుంది. టీటీడీ చైర్మన్గా బీసీని టీడీపీ హాయంలో నియమిస్తే.. ఆయనపై వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అదే క్రిస్టియన్ ఫ్యామిలీ అనే ఆరోపణలు ఉన్నా.. టీటీడీ చైర్మన్ రెడ్డి ఫ్యామిలీనే వ్యవహరిస్తోంది. ఇక కార్పొరేషన్లు పెట్టారు.. పదవులు ఇచ్చారు. కానీ.. ఒక్కరికైనా ఆయా కులాల్లో లబ్ది చేకూరిందా.. అసలు ఆ కుల కార్పొరేషన్లకు కార్యాలయాలు కూడా లేవు. ఇదే ఇతర రెడ్లకు ఇచ్చే నామినేటెడ్ పోస్టులు మాత్రం పవర్ ఫుల్. చివరికి వంగవీటి రంగాను దారుణంగా తిట్టిన గౌతంరెడ్డికి కూడా నిధులు దండిగా ఉండే పదవి ఇచ్చారు.
ఇప్పుడు మళ్లీ బీసీల పేరుతో రాజకీయానికి రెడీ !
ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూండటంతో.. బీసీలంటూ.. నాటకాలు ప్రారంభించారు. పార్టీలోని బీసీ నేతలందర్నీ.. తెచ్చి ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వారిని ఐస్ చేద్దామనుకుంటున్నారు. బీసీ నేతలతో సభలు, సమావేశాలు.. సామాజిక వర్గ సంఘాలతో ఆత్మీయ భేటీలు నిర్వహించాలన్న ఆలోచనకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీల మద్దతు తమకు అత్యంత కీలకమని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భావిస్తున్నారు . గత ఎన్నికల్లో వారు అండగా ఉండటం వల్లే భారీ మెజారిటీ సాధించామని ఆయన నమ్ముతున్నారు. కానీ వారు ప్రతీ సారి మోసపోతారా అన్నదే అసలు టాపిక్