కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేస్తే ఎదురుదాడి చేయండి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతో… మల్లారెడ్డి అదే చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేస్తే ఎలా చేస్తాయో.. రాజకీయ నేతలకు బాగా తెలుసు. రాజకీయ ఒత్తిడితో సోదాలు చేసినా వారి పని వారు చేసుకెళ్తారు కానీ… తప్పుడు లెక్కలు.. సాక్ష్యాలతో ఇరికించే ప్రయత్నం చేయరు. కానీ మల్లారెడ్డి మాత్రం కేసీఆర్ చెప్పారని వారిపై ఆరోపణలు చేశారు.. కొట్టారన్నారు. కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన మరింతగా కూరుకుపోయారన్న వాదన వినిపిస్తోంది. ఆయన విద్యాసంస్థలకు గండం పొంచి ఉందని గుసగుసలాడుకుంటున్నారు.
మల్లారెడ్డిలాగే తాము చేస్తే ఇరుక్కుపోతామని ఎక్కువ మంది టీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ దాడులు చేసినాఆయన ఎక్కడా నోరు జారలేదు. ఆయన ఇంటి తాళాలు పగులగొడితే.. తానే పగలగొట్టమని చెప్పానని కవర్ చేసుకున్నారు. ఈడీ అధికారులపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దర్యాప్తునకు సహకరిస్తామన్నారు. ఇతరులూ అంతే. ఐటీ , ఈడీ అధికారులపై తిరుగబడిన వారు లేరు. కానీ మల్లారెడ్డి మాత్రం తొడకొట్టినంతపని చేశారు. దీంతో ఆయన మరింతగా టార్గెట్ అయ్యారు.
కెసిఆర్ మా వెనక ఉన్నారు.. ఆయన మాటే శిరోధార్యమని భావించిన నేతలు ఇప్పుడు మల్లారెడ్డి ఎపిసోడ్ చూసి కాస్త భయపడుతున్నారు. అనవసరంగా కేంద్ర దర్యాప్తు సంస్థ లతో పెట్టుకుంటే ముందు ముందు మరిన్ని ఇబ్బందులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని భయపడుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలు విని మల్లారెడ్డి అనవసరంగా ఐటి అధికారులతో పంచాయితీ పెట్టుకున్నారు అన్న చర్చ గులాబి నేతల్లోనూ వ్యక్తమౌతుంది. ఒకవేళ ఐటి దాడులు జరిగినా, ఈడీ దాడులు జరిగినా ఎదురుతిరిగి ఇష్యూని కాంప్లికేట్ చేసుకునే బదులు, సైలెంట్ గా అధికారులకు సహకరిస్తే పోతుందని చర్చ జరుగుతుంది.