కృష్ణా జిల్లాలో మచిలీపట్నం డిపోలో మొత్తం 110 బస్‌లు వుంటే అందులో ఆర్టిసి సొంతబస్సులు 58కాగా, అద్దెబస్సులు 52 వున్నాయి. అద్దె బస్సులు నడిపేది ఉద్యోగులు కాదు.. ప్రైవేటు వ్యక్తులు. దీంతో మచిలీపట్నం డిపోలో ఉన్న ప్రజా రవాణా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో డ్యూటీలు లభించడం లేదు. ఇలా అన్ని డిపోల్లోనూ అద్దె బస్సులను పెంచుతున్నారు. ఆర్టీసీ సొంత బస్సులను పెంచుకునే బదులు అద్దె బస్సులను తీసుకుంటోంది. దీనివల్ల రెగ్యులర్ డ్రైవర్, కండక్టర్లకు డ్యూటీలు తగ్గిపోతున్నాయి. కొద్దిమందిని ట్రాఫిక్ డ్యూటీలకు పంపిస్తున్నారు. మరికొంతమందిని డిపోల్లో భద్రతా చర్యలకు కేటాయిస్తున్నారు.
డ్యూటీలు అంతకంతకూ తగ్గిపోతుండటంతో కొద్దిమందికి బలవంతపు సెలవులు ఇచ్చేస్తోంది. వారికి జీతాల్లోనూ కోత విధిస్తోంది. ఎపిఎస్ ఆర్టిసిలో మొత్తం 11,236 బస్సులుంటే అందులో 2,350 అద్దెబస్సులే. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్తగా ఒక్కబస్సూ కొనుగోలు చేయని యజమాన్యం ఏటేటా అద్దెబస్సులను పెంచుకుంటూ పోతోంది. 2022లో దాదాపు వెయ్యి అద్దెబస్సులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం 2023లోనూ మరో వెయ్యి అద్దె బస్సులను తీసుకునేందుకు ప్రణాళికలను తయారు చేస్తోంది.
విద్యుత్ బస్‌లన్నీ అద్దెబస్సులుగానే తీసుకుంటున్నారు. ఇకపై విద్యుత్ బస్సులన్నీ అద్దె ప్రాతిపాదికనే తీసుకునేందుకు ఆలోచన చేస్తోంది. దీనివల్ల రెగ్యులర్ ఉద్యోగులకు పని తగ్గిపోతోంది. గత ఐదేళ్లుగా ఆర్టిసిలో కొత్త ఉద్యోగ నియమకాలు చేపట్టలేదు. ఇప్పుడు వున్న ఉద్యోగుల సంఖ్య కూడా ఏటేటా తగ్గిపోతోంది. మొత్తం ప్రజారవాణాను నిర్వీర్యం చేసి ఆర్టిసిని ప్రైవేట్‌పరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగా ఉద్యోగులు అనుమానిస్తున్నారు.