పవన్ కల్యాణ్ ఎప్పుడైనా మీటింగ్ పెడితే .. ఆయన ప్రసంగం అయిపోగానే.. వైసీపీ ఆఫీసులో ఒకరు కౌంటర్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అలా కౌంటర్ ఇచ్చే వారిలో ఎక్కువ కనిపించేది .. మాజీ మంత్రి పేర్ని నాని. ఆయనైతేనే ఘాటుగా సమాధానం చెబుతారని వైసీపీ పెద్దలనుకుంటారు. కానీ ఈ సారి మాత్రం బొత్సను రంగంలోకి దింపారు. ఇప్పటం గ్రామస్తులకు సాయం చెక్కుల పంపిణీ తర్వాత పవన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వతా బొత్స తెరపైకి వచ్చారు.
కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. కేంద్రంలో పవన్ ఫ్రెండే ఉన్నారు కదా.. వెళ్లి మాట్లాడొచ్చుగా అని బొత్స సూచించారు. బొత్స మాటలు విని జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే… సార్ ..సార్ అంటూ జగన్… మోదీని.. మనది పార్టీలకు అతీతమైన బంధం అని బహిరంగంగా చెప్పుకున్నారు. అంతేనా.. కేంద్రంలో ప్రతీ దానికి మద్దతిస్తున్నారు. అడగకుండానే ఇస్తున్నారు. ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల షరతులు పెట్టలేదు. ప్రజలిచ్చిన బలాన్ని ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటూ.. ప్రజల కోసం అడగమంటే.. పవన్ .. బీజేపీ ఫ్రెండే కదా అడగాలని బొత్స అంటున్నారు.
మామూలుగా అయితే ఇతరులు తెరపైకి వచ్చేసి… పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శించేవారు. కానీ బొత్స మాత్రం పవన్ విషయంలో ఇటీవలి కాలంలో సాఫ్ట్ గా ఉంటున్నారు. పాలసీల గురించే మాట్లాడుతున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటంలేదు. గతంలోనూ అంతే. విజయనగరం జిల్లాగుంకలాంలో ఇళ్ల పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా అంతే స్పందించారు. మొత్తంగా బొత్స.. వైసీపీ హైకమాండ్ అంచనాలను అందుకోవడం లేదన్న గుసగుసలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి.