ఎవరేమైనా అనుకోనీ..తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పార్టీ పుట్టి ముంచనిదే.. తగ్గేదే లేదంటున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకుంటే.. ఆయనే ఎందుకు తాను కూడా చేస్తానని భట్టి విక్రమార్క తెర ముందుకు వచ్చారు. భట్టి విక్రమార్క వెనుక రేవంత్ ను వ్యతిరేకించే సీనియర్లు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ఇప్పుడు హైకమాండ్ రేవంత్ పాదయాత్రకు అనుమతించాలా.. లేకపోతే ముగ్గురు నలుగురుతో పాదయాత్ర చేయించాలా.. లేక బస్సు యాత్రకు అనుమతివ్వాలా అని తర్జన భర్జన పడుతోంది.
పార్టీలో మాస్ లీడర్ని ముందు పెట్టి.. ఆయనే కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం అని ప్రొజెక్ట్ చేస్తే తప్ప .. కనీస ఫలితం రాని రాజకీయాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. టీ కాంగ్రెస్ నేతలు మాత్రం .. ఎవరికి వారే తామే గొప్ప లీడర్లమనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటే.. దాన్ని మిగతా సీనియర్లందరూ కలిసి పాత స్థితికి తీసుకురావడంతో ఎప్పుడూ చేయనంత కృషి చేశారు. ఇప్పుడు ఇంకా దిగజార్చేందుకు వెనుకాడటం లేదు.
రేవంత్ రెడ్డి తెలంగాణలో డిసెంబర్ 9 నుంచి పాదయాత్ర చేయాలనుకున్నారు. అయితే పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకికాదని.. రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు. రేవంత్‌కు తోటుగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అసలు పాదయాత్రలు కాదని.. నేతలందరూ బస్సు యాత్ర చేయాలన్న ఓ ప్రతిపాదన కూడా హైకమాండ్ ముందు పెట్టారు. బస్సుయాత్ర ఖరారైతే దాదాపు 10 మంది నేతలు రాష్ట్రవ్యాప్తంగా బస్సులో పర్యటించి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలందరూ ఐక్యంగా ఉన్నామనే సంకేతాలిచ్చినట్లవుతుందంటున్నారు.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా.. నిర్లిప్తతకు గురవుతున్నారు. లీడర్లే మారనప్పుడు ఇక క్యాడర్ ఏం చేస్తుందని సైలెంట్ అయిపోతున్నారు. కాంగ్రెస్‌ను కాంగ్రెస్సే ఓడించుకుంటుందనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేత్లని చూస్తే సులువుగానే అర్థం చేసుకోవచ్చంటున్నారు.