ఉద్యోగులు ప్రభుత్వ పెద్దల కాళ్లు పట్టుకుని అయినా సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ.. పదే పదే ఉద్యమం అనడం కరెక్ట్ కాదని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులకు సలహా ఇచ్చారు. ఎక్కడో కాదు.. ఉద్యోగ సంఘాల సమావేశంలోనే . గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందర్నీ తీసుకు వచ్చి విజయవాడలో సమావేశం పెట్టించారు కొంత మంది ఉద్యోగ సంఘ నేతలు. ఈ సమావేశానికి బొత్స, ఆదిమూలపు సురేష్ లాంటి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స వారికి చేసిన హితోపదేశం విని అందరూ నోరెళ్లబెట్టాల్సి వచ్చింది.
సమస్యల పరిష్కారంలో సామ, దాన, భేద దండోపాయాలు సహజమేనని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. సామ, దాన సంప్రదాయాలు.. ప్రభుత్వం ఎక్కడా పాటించిన దాఖలాలు లేవు. దండోపాయాలు.. కేసులు పెట్టి బెదిరించడం ద్వారా మాత్రమే ప్రభుత్వం ఉద్యోగులను కట్టడి చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు .. పర్మినెంట్ అయినా తాము ప్రభుత్వ ఉద్యోగులమో కాదో అన్న సందేహంలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన అలవెన్స్లు ప్రయోజనాలు అందడం లేదు. ఉన్నతాధికారులు రకరకాల నిబంధనలు పెట్టి టార్చర్ పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ బొత్స కనీసం వినిపించుకునే ప్రయత్నం చేయకపోగా.. కాళ్లు పట్టుకుని బతిమాలుకోవాలని సలహా ఇస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే తమకు ముఖ్యమని.. ఎన్నికల విధుల్లో వారుంటారు కాబట్టి .. వైసీపీకి కాపు కాసుకోవాలని కొంతమంది వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతూ ఉంటారు. అయితే వారి సమస్యల విషయంలో మాత్రం.. కాళ్లు పట్టుకోవాలని.. పట్టు విడుపులు ఉండాలని… గొంతెమ్మ కోరికలు కోరకూడదని ఇలా రకరకాల వ్యాఖ్యలను ప్రభుత్వం తరపున చేస్తున్నారు.