ఇప్పటం రైతుల్లా పోరాడితే అమరావతి తరలిపోయేది కాదని జనసేన పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఇప్పటం రైతులు చేసిన పోరాటం ఏమిటి..? అమరావతి రైతులు చేయనిది ఏమిటి ? అన్నది అనేక మందికి వస్తున్న సందేహం. ఇప్పటం రైతులు ఎలాంటి పోరాటం చేయలేదు. వారు ఇళ్లు కూలగొట్టే వరకూ ఏ ఉద్యమమూ చేయలేదు. ఇళ్లు కూలగొట్టిన తర్వాత కూడా ఆ గ్రామం మొత్తం ఏకతాటిపైకి రాలేదు. అసలు రైతులు ఎలాంటి ఉద్యమమూ చేయలేదు. పైగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి .. ఫైన్స్ వేయించుకోవాల్సి వచ్చింది.
మరి పవన్ దృష్టిలో ఇప్పటం రైతులు చేసిన పోరాటం ఏమిటోన్న సందేహం ఎక్కువ మందికి వస్తోంది. బహుశా.. ప్రభుత్వ నిర్బంధాలను కాదని.. జనసేన సభకు భూములు ఇవ్వడమే పోరాటం అని పవన్ అనుకుంటున్నారేమో తెలియదు కానీ.. అలాంటి ఉద్యమం అయితే అమరావతి రైతులు రాష్ట్రం కోసం ఎప్పుడో చేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరమని.. ప్రజారాజధాని నిర్మాణానికి అవసరం అని ప్రభుత్వం అడగగానే.. అన్ని పక్షాలు ఓకే చెప్పగానే.. వేల ఎకరాల భూముల్ని.. అసువుగా ఇచ్చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత వారు చేయని ఉద్యమం లేదు. పడని కష్టాలు లేవు.లాఠీ దెబ్బలు తిన్నారు. కేసుల పాలయ్యారు. జైళ్లకు వెళ్లారు.
మహిళలనే తేడా లేకుండా.. అన్ని పోరాటాలు చేశారు. చివరికి న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అలా చేయబట్టే.. అమరావతికి రాజ్యాంగం అండగా నిలిచింది. ఇప్పడు అమరావతే రాజధాని అని హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. తరలిపోయే చాన్స్ లేదు. ముఖ్యమంత్రే పెడసరంగా… తాను వైజాగ్ పోయి పాలన చేస్తానని చెబుతున్నారు. దాన్ని ఎలా అయినా సమర్థించుకోవచ్చు.. కానీ నైతికంగా.. మాత్రం పతనం అయినట్లే. దీన్ని పవన్ పట్టించకోకుండా.. అమరావతి రైతుల ఉద్యమంలో ఏదో లోపం ఉందని..ఇప్పటం రైతుల్లా పోరాడలేదని వ్యాఖ్యానించడం.. అమరావతి రైతుల్ని అవమానించడమే. అయినా పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో స్పష్టత రావాల్సి ఉంది.