మోడీ సర్కారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత.. రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ సాగిన ప్రచారాన్ని, అలా అంటుకున్న కొంత కళంకాన్ని సమూలంగా తుడిచిపెట్టేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది. ‘రైతు మిత్ర’ బడ్జెట్ ప్రతిపాదనల్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదిస్తున్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి నాలుగు ప్రత్యేక పథకాలను ఆయన ప్రకటించారు. అలాగే పంటల బీమా విషయంలోనూ కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ రంగంలో సేవలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సమీకృతంగా అందించేలా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా 28 లక్షల ఎకరాలను సాగులోకి తేవడం లక్ష్యంగా ఎంచుకుంటున్నట్లు జైట్లీ ప్రకటించారు. గ్రామీణ వ్యవసాయ బ్యాంకింగ్ రంగాలకు దన్నుగా నిలుస్తామని ప్రకటించారు.
నరేంద్రమోడీ సర్కార్ పాలన ప్రారంభించిన తర్వాత.. తొలిరోజుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతు వ్యతిరేక ముద్ర పడడానికి కారణం అయ్యాయి. ప్రత్యేకించి భూసేకరణచట్టంలో మార్పులు వంటివి దీనికి కారణం అయ్యాయి. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రలు గట్రాచేసి రైతు వ్యతిరేక ఇమేజి పెరగడానికి కొంత కష్టపడ్డారు. అయితే ఈ బడ్జెట్లో చాలా వరకు రైతు ప్రయోజనాలపై దృష్టిపెట్టారు. రైతు సంక్షేమానికి ఏకంగా 36 వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం.
రాబోయే మూడేళ్లలో 5లక్షల ఎకరాల్లో ఆర్గానిక్ సేద్యం చేసేలా ప్రణాళికలు తెస్తున్నారు. గ్రామాలసంక్షేమానికి ప్రత్యేకించి విద్యుత్, రోడ్డు వసతులు కల్పించడానికి అనేక నిర్ణయాలు ప్రకటించారు. సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పరంపరాగత్ కృషియోజన పేరుతో పథకాలు రూపొందించారు. ఈశాన్య భారతం కోసం ప్రత్యేక సేంద్రియ విధాన పద్ధతులు తెస్తాం అన్నారు. పప్పు ధాన్యాల సాగుకు ప్రత్యేక పథకాలు ప్రకటించారు.