బాబాయ్‌ను చంపినంత ఈజీగా తనను, లోకేష్‌ను చంపేద్దామనుకుటున్నారని .. వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌కు పోలీసుల అండ ఉంటే..తనకు ప్రజల మద్దతు ఉందన్నారు. వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..” కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు.అప్పట్లో మొద్దుశీనుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పి ఉంటే..తనను ఇంట్లోనే చంపేసి ఉండేవారమని బెదిరిస్తున్నారని… ఇప్పుడు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకున్నామంటున్నారని మండిపడ్డారు.
వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. గొడ్డలి పోటుని గుండె పోటుగా మార్చారని.. కోడి కత్తి డ్రామా ఆడారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పోలీసుల మెడ మీద కత్తి పెట్టి పని చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ వివేకా కేసు సుప్రీం కోర్టు నుంచి హైదరాబాద్ కోర్టుకు వెళ్లడం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
ఇటీవల వైఎస్ఆర్సీపీ నేతల నుంచి చంద్రబాబును, లోకేష్‌ను చంపుతామనే బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. నేర చరిత్ర ఉన్న నేతలు ఇలా ప్రకటనలు చేస్తూండటంతో టీడీపీ నేతల్లోనూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానం ఉండటంతోనే … కేంద్రం భద్రత పెంచిందని భావిస్తున్నారు. ఆషామాషీగా ఇలాంటి హెచ్చరికలు చేయరని.. రాజకీయ, భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.