కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు సరిగ్గా ఉదయం 11గంటలకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ తన ప్రసంగం ప్రారంభించారు. ఆయన తన ప్రసంగం ప్రారంభిస్తూ ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉన్నప్పుడు నేను ఈ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నాను. అయినప్పటికీ మన ఆర్ధిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. సమస్యలను, సవాళ్ళను అవకాశాలుగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నాము. మన దేశ విదేశీ మారక నిల్వలు $350 బిలియన్లు చేరుకోన్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆదాయంలో 55 శాతం నిధులను రాష్ట్రాలకు పంచి ఇస్తున్నాము.
ఇంతవరకు ఆ బడ్జెట్ లో పేర్కొన్న ముఖ్యాంశాలు:
ఆదాయపన్ను శ్లాబులు, రేట్లు యథాతథం. బడ్జెట్ రూ.19.78 లక్షల కోట్లు. ప్రణాళికా వ్యయం రూ.5.5 లక్షల కోట్లు.ప్రణాళికేతర వ్యయంరూ. 14.28 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూ. 87, 765 కోట్లు, వ్యవసాయానికి రూ. 35, 984కోట్లు, సాగర్ మాల ప్రాజెక్ట్-రూ.80,000 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు,జాతీయ రహదారుల నిర్మాణం-రూ.55వేల కోట్లు
1. జిడిపి అభివృద్ధి 7.6 శాతంగా నమోదు అయ్యింది.
2. వ్యవసాయానికి రూ. 35,985 కేటాయింపు
3. ప్రధానమంత్రి కృషి సిన్చాయ్ యోజన పధకం క్రింద గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.
4. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పధకం క్రింద నామ మాత్రపు ప్రీమియంతోనే అత్యధిక పరిహారం చెల్లింపు.
5. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకొనేందుకు ఏప్రిల్ 14,2016 నుంచి ఈ-ప్లాట్ ఫార్మ్ ఏర్పాటు.
6. రానున్న ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలను కేవలం సేంద్రీయ వ్యవసాయం క్రిందకు తీసుకువస్తాము. కొత్తగా 28.5 లక్షల హెక్టార్ల భూమిని సాగులోకితీసుకు రాబడుతుంది.
7. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకం క్రింద దేశంలో మారు మూల గ్రామాలకు రోడ్లు వేసేందుకు రూ.19, 000 కోట్లు.
8. గ్రామీణాభివృద్ధి కోసం మొత్తం రూ:87765 కోట్లు కేటాయింపు
9. 2018, మే 1వ తేదీలోగా దేశంలో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తాము.
10. స్వచ్చ భారత్ కార్యక్రమానికి రూ.9000 కోట్లు.
11. ఇకపై గ్రామాలలో బి.పి.ఎల్. కుటుంబాలలో మహిళల పేరు మీదనే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడతాయి. దీని కోసం బడ్జెట్ లో రూ.2000 కోట్లు కేటాయింపు.
12. ప్రధాని నరేంద్ర మోడి పిలుపు మేరకు దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి చెందిన 75 లక్షల మంది గ్యాస్ పై సబ్సిడీని వదులుకొన్నారు.
13. ఎస్సీ ఎస్టీ యువతలో వృత్తిపరమయిన నైపుణ్యం సమకూర్చుకోనేందుకు దేశ వ్యాప్తంగా 1500 శిక్షణ కేంద్రాల ఏర్పాటు.
14.విద్యార్ధులు, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కోసం రూ.1000 కోట్లు కేటాయింపు. ఉన్నత విద్యా సంస్థలలో అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు సమకూర్చుకొనేందుకు రూ.1000 కోట్లు కేటాయింపు.
15. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ క్రింద దేశ వ్యాప్తంగా డయాలసిస్ సెంటర్లు (రక్తం శుద్ధి చేసే యంత్రాలు) ఏర్పాటు.
16. కొత్తగా ఉద్యోగంలో చేరినవారి కోసం మొదటి మూడు సం.లు 8.33 శాతం ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది.
17. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయంలో మొదలయిన రోడ్ల నిర్మాణ కార్యక్రమానికి రూ. 97000 కోట్లు కేటాయింపు. గత సం.లో దేశంలో కొత్తగా 10,000 కిమీ రోడ్లు నిర్మించబడ్డాయి. 2016లో 50,000కిమీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్నాము.
18. ఫుడ్ ప్రాసెసింగ్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి మంజూరు.
19. జాతీయ బ్యాంకులను రీ-క్యాపిటలైజేషన్ కోసం రూ.25000 కోట్లు కేటాయింపు.
20. రైల్వేస్ మరియు జాతీయ రహదారుల అభివృద్ధి కోసం రూ. 2,180,00 కోట్లు అంచనాలు.
21. దేశంలో మారుమూల గ్రామాలకు కూడా బ్యాంక్ సేవలను విస్తరింపజేస్తూ పోస్ట్ ఆఫీసులలో కూడా ఏటిఎంమ్, మినీ ఏటిఎంమ్ యంత్రాల ఏర్పాటు.
22. స్వంత ఇళ్ళు లేని కారణంగా అద్దె ఇళ్ళలో నివసిస్తున్న వారికి ఆదాయపు పన్నులో ఏడాదికి రూ.24,000 తగ్గింపు. దానిని మున్ముందు ఏడాదికి రూ.60,000కి పెంచేందుకు ప్రయత్నాలు.
23. మార్చి 1, 2016 లోగా లేదా ఆ తరువాత కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకొన్నవారికి 25శాతం పన్ను ప్లస్ సర్ చార్జ్ మరియు సెస్స్ చెల్లింపులో వెసులుబాటు కల్పించబడుతుంది.
24. కొన్ని ముడి సరుకుల దిగుమతిపై కస్టమ్స్ మరియు ఎక్సయిజ్ సుంకాల విధానాలలో సరళీకరణం చేయబడతాయి. 60 చదరపు మీటర్ల వరకు విస్తీర్ణం ఉండే ఇళ్ళపై సర్వీస్ టాక్స్ మినహాయింపు.
25. రూ. 5 కోట్లు కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న ఐటి సంస్థలపై వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి ఆదాయపన్ను తగ్గింపు.
26. మొట్ట మొదటిసారిగా ఇళ్ళు కొనుగోలు చేసేవారికి రూ. 35లక్షలు వరకు బ్యాంక్ రుణాలపై వడ్డీలో ఏడాదికి రూ.50,000 తగ్గింపు. (ఇది మధ్య తరగతి వారికి చాలా మేలు చేస్తుందని చెప్పవచ్చును.)
27. లగ్జరీ కార్లు, ఎక్కువ ఇంజన్ సామర్ధ్యం కలిగిన కార్లపై 5 శాతం అదనపు పన్ను వసూలు చేయబడుతుంది.
28. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గాను అన్ని రకాల సేవలపై ఇక నుంచి కృషి వికాస్ పన్ను విదింపబడుతుంది.
29. బంగారు ఆభరణాలపై (ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా) అధనంగా 1శాతం ఎక్సైజ్ పన్ను.
30. ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనలతో రెవెన్యూ నష్టం రూ.1060 కోట్లు కాగా పరోక్ష పన్ను ప్రతిపాదనలతో రూ.20,670 కోట్లు ఆదాయం పెరిగే అవకాశం. మొత్తంగా చూసుకొన్నట్లయితే రూ.19, 610 కోట్లు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరబోతోంది.
కొద్ది సేపటి క్రితమే అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ముగించడంతో సభ రేపటికి వాయిదా పడింది