అమరరాజా సంస్థ తమ పెట్టుబడులను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి ప్రయత్నిస్తోందని బిజినెస్ వర్గాల్లో కొంత కాలం కిందట ప్రచారం జరిగింది.. అప్పుడు ఘనత వహించిన డీఫ్యక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ముఖ్యంగా కక్ష సాధింపుల కోసం రేయింబవాళ్లు స్కెచ్‌లు గీసే .. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఓ మాట అన్నారు.. అదేమిటంటే..
“వాళ్లు వెళ్లడం కాదు.. తామే దండం పెట్టి వెళ్లిపొమ్మన్నాం..” అని! ఆ మాట విన్న తర్వాత … పెట్టుబడులు పెట్టి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వచ్చిన ఎవరైనా.. అక్కడ ఒక్క క్షణం ఉండాలనుకోరు. అమరరాజా యాజమాన్యం కూడా అదే చేసింది.
వెంటనే ఇతర రాష్ట్రాలు అందుకున్నాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి అమరరాజాకు ప్రతిపాదనలు వచ్చాయి. చివరికి తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నచ్చడంతో అమరరాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంసింది. రూ. 9,500 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ ప్లాంట్ పెట్టబోతోంది. దీనికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయి.
నిజానికి ఈ పెట్టుబడులు.. ఎప్పట్లాగే.. చిత్తూరులోనే పెట్టాలనుకున్నారు అమరరాజా ఓనర్లు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. భారీ పెట్టుబడులు పెట్టబోతున్నామని ప్రకటించారు. కానీ ఎప్పుడైతే.. వికృత పాలకుల దుష్ట రాజకీయం… గల్లా కుటుంబంపై పడిందో అప్పటి నుండి రాక్షసత్వం బయటపడింది. కొన్ని వేల మంది రాయలసీమ ప్రజలకు ఉపాధి కల్పిస్తూ.. ప్రభుత్వానికి సైతం వందల కోట్ల పన్నుల రూపంలో ఆదాయం ఇస్తున్న పరిశ్రమని తప్పుడు కాలుష్య నివేదికలతో రాత్రికి రాత్రి మూయించారు. మూడు నాలుగు రోజుల పాటు ప్లాంట్ మూతపడింది. కోర్టుకెళ్లి ఎలాగో మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు. దాని వల్ల ఎవరికి నష్టం జరిగింది ?
ఈవీ బ్యాటరీ పరిశ్రమ చిత్తూరులోనే పెట్టి ఉంటే.. కొన్ని వేల కుటుంబాలు నిశ్చింతగా సొంత ఊరిలో ఉంటూ.. ఉపాధి పొందేవి. ఇప్పుడా అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కుతోంది. చంద్రబాబు హయాంలో చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఆ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలే పొరుగురాష్ట్రానికి పరారావుతున్నారు. ఇక బయట వారు ఎలా వస్తారు ?
ఇక్కడ అసలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. అమెరికాలో సుఖంగా ఉండే జీవితాన్ని వదులుకుని… తాము బాగుపడితే చాలదని.. తమకు జన్మనిచ్చిన చిత్తూరు ప్రాంతాన్ని బాగు చేయాలని.. వచ్చి బ్యాటరీ ప్లాంట్ పెట్టి…అంచెలంచెలుగా ఎదిగిన ఓ ఆదర్శ పారిశ్రామిక వేత్తను కూడా భయపెట్టి పరారయ్యేలా చేయడం. వారు సంస్థను ప్రారంభించాకా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వారికి ప్రజల పట్ల కనీస బాధ్యత ఉంది. అందుకే ఆ సంస్థ జోలికి పోలేదు.ఇప్పుడీ ప్రభుత్వానికి ఏమీ లేదు. దశాబ్దాల తరబడి ఉన్నసంస్థ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించే సంస్థపై తప్పుడు నివేదికలో నిందలు వేసి వెళ్లగొట్టారు… ఇదేం ఖర్మ చిత్తూరు జిల్లాకు.. ఇదేం ఖర్మ ఏపీకి..!