ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల ఆర్థిక అక్రమాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మినారాయణ.. ప్రీ లాంట్ ఆఫర్లతో కనీసం వెయ్యి కోట్లకుపైగా రియల్ ఎస్టేట్ మెసానికి పాల్పడ్డారు. వందల కుటుంబాలను ఆర్థికంగా ముంచేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రికి రాత్రి ఆయన టీటీడీ బోర్డు సభ్యుడి పదవికి రాజీనామా చేసినట్లుగా చెప్పుకున్నారు.. కానీ చేసిన నేరం సంగతేంటి ? ప్రజలను వందల కోట్లకు ముంచిన ఆయన సైలెంట్‌గా అరెస్ట్ అయపోయారు. ఇప్పుడు ఆయన బాధితులకు డబ్బులు ఎవరు ఇప్పిస్తారు ? వైసీపీ రాజగరువు.. ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న లక్ష్మినారాయణ.. ఆ డబ్బులన్నీ ఏం చేశారో తేలాల్సిఉంది.
అదొక్కటే కాదు.. తాజాగా సంచలనం సృష్టిస్తున్న మరో కేసు.. సంకల్పసిద్ధి మార్ట్. విజయవాడ , గన్నవరం కేంద్రంగా రూ. పదకొండు వందల కోట్ల వరకూ గొలుసుకట్టు విధానంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి చేతులెత్తేసిన సంస్థ ఇది. ఇందులో ప్రధానంగా వైసీపీ నేతల పేర్లే వినిపిస్తున్నాయి. వెంటనే భుజాలు తడుముకున్న గన్నవరం ఎమ్మెల్యే.. నేరుగా వెళ్లి డీజీపీకి చెప్పుకుని .. తనపై ఆరోపణలు చేస్తే లోపలేయిస్తామని బెదిరింపులకు దిగారు.కానీ ఆ సంకల్పసిద్ధి ఎవరిదో.. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో గన్నవరంలోనే కథలు కథలుగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ కేసులో తెరపైకి కనిపించే కొందర్ని అరెస్ట్ చేశారు.
ఈ రెండు వ్యవహారాల్లో ప్రజాధనం రూ. వేల కోట్లు వైసీపీ నేతల వద్దకు చేరింది. వారు దాన్ని ఏం చేశారో కానీ.. నమ్మిన వాళ్లందర్నీ నట్టేట ముంచారు. ఇప్పుడు ఆ బాధితులకు ఎవరు న్యాయం చేస్తారు ? సామాన్య మధ్యతరగతి ప్రజలు.. రూపాయి రూపాయి కూడబెట్టి సొంత ఇంటి కోసం కలలు కంటారు. వాటన్నింటినీ చిదిమేశాడు బూదాటి లక్ష్మినారాయణ. మధ్యతరగతి ప్రజలకష్టాన్ని దోచుకున్నారు సంకల్ప సిద్ధి మాస్టర్ మైండ్లు. వీరిని అరెస్ట్ చేయడం కాదు.. బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించినప్పుడే అసలైన న్యాయం జరుగుతుంది.