టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించడానికి ఆరో తేదీన వస్తామని నోటీసులు జారీ చేశారు. ఆమె అందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లోని ఇంటికే రావాలని ఆప్షన్ ఇచ్చుకున్నారు వాళ్లు వస్తారు.. ప్రశ్నిస్తారు అది వేరే విషయం. కానీ తెలంగాణలో సీబీఐ దర్యాప్తు చేయడాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. ఏ కేసు విషయంలో అయినా సీబీఐ దర్యాప్తు నేరుగా చేయడం కుదరదు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తే.. వారే దర్యాప్తు చేసి పెడతారు. నిందితులు ఉంటే ప్రశ్నించి పెడతారు.కానీ ఇక్కడ కల్వకుంట్ల కవితనే నేరుగా సీబీఐ రావడానికి అంగీకరించారు.
ప్రస్తుతం తెలంగాణ సర్కార్ జనరల్ కన్సెంట్ను రద్దు చేయడం ద్వారా.. కేంద్ర ఉద్యోగులపైనా సీబీఐ అధికారులు దాడులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వారు అంగీకరిస్తే చేయాలి లేదంటే లేదు. ఏదైనా అవినీతి సమాచారం ఉంటే.. ఏసీబీనే దాడి చేస్తుంది. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థల సిబ్బందిపై ఏసీబీ దాడులు చేస్తారన్న ప్రచారం జరగడానికి ఇదే కారణం. ఇప్పుడు కవిత జనరల్ కన్సెంట్ రద్దు నిర్ణయాన్ని మర్చిపోయి.. తెలంగాణలోకి సీబీఐ ఎంట్రీకి అవకాశం కల్పించారు.
లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు హైదరాబాదే సేఫ్ ప్లేస్‌గా కవిత భావిస్తున్నారు. ఢిల్లీలో అయితే ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం బీజేపీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకైనా మంచిదని హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. హైదరాబాద్‌లో విచారణ అంటే.. జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం అవుతుందని వ్యూహాత్మకంగా ఢిల్లీ ఆర్ హైదరాబాద్ అని సీబీఐ చెప్పింది. హైదరాబాద్‌ను కవిత ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు జనరల్ కన్సెంట్ అంశం… అటూ ఇటూ కాకుండా అయిపోయే ప్రమాదం ఏర్పడింది.