కర్నూలులో న్యాయరాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీనే కర్నూలులో న్యాయరాజధాని కోసం గర్జన నిర్వహిస్తోంది. దీనికి మేధావులుగా చెలామణి అవుతున్న వారు మద్దతు తెలుపుతున్నారు. హైకోర్టు వల్ల ఏం వస్తుంది.. ఎంత మందికి ఉపాధి లభిస్తుంది.. అన్న విషయాలను వారు చర్చించడం లేదు. మనకు రావాల్సిన హైకోర్టును ఆపేస్తున్నారని ఓ భావోద్వేగం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. సీమ యువత ఆకలి తీర్చే ఉద్యోగాలను ఇచ్చే పారిశ్రామిక సంస్థలను వెళ్లగొడుతున్నారు. దీని గురించి ఒక్క మాట కూడా వారు మాట్లాడటం లేదు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ పారిశ్రామికంగా తీవ్రంగా నష్టపోయింది.కియా లాంటి భారీ పరిశ్రమ వచ్చినప్పుడు అనుబంధ పరిశ్రమలు కుప్పలు, తెప్పలుగా ఏర్పడాలి. కానీ ప్రభుత్వ భయంతో ఒక్కరూ రాలేదు. అందరూ ఇతర రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. చివరికి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించిన జాకీ కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. ఇప్పుడు.. చిత్తూరు జిల్లా వాసులకు ఉపాధి కల్పించడానికి అమెరికా నుంచి వచ్చిన పరిశ్రమలు పెట్టిన.. అమరరాజా గ్రూప్ కూడా .. చిత్తూరు కాదని తెలంగాణను ఎంచుకుంది. ఇక విస్తరణ ఇతర రాష్ట్రాల్లోనే ఉంటుందని ఆ సంస్థ తేల్చి చెప్పింది.
రాయలసీమలో రావాల్సిన అతి పెద్ద జియో ప్లాంట్ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇలా లెక్కలు వేసుకుంటే.. సీమ యువతకు రావాల్సిన కొన్ని లక్షల ఉద్యోగాలు .. ప్రభుత్వ వైఖరి.. వైసీపీ నేతల దౌర్జన్యాల వల్ల దూరమయ్యాయి. దీనిపై ఒక్కరంటే ఒక్క మేధావి మాట్లాడటం లేదు. యువతలో పెరిగోపుతున్న అసహనాన్ని హైకోర్టు పేరుతో తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీమ యువతకు తీరని ద్రోహం చేస్తున్నారు. రాజకీయాల కోసం.. ఓ పార్టీ అధికారంలో ఉండటం కోసం.. తమ ప్రాంత యువతను నిర్వీర్యం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడని మేధావుల బృందం బయలుదేరింది. ఇప్పుడు అదే జరుగుతోంది.