తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెలలో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సమావేశాల్లో యూనివర్శిటీలకు చాన్సలర్‌గా గవర్నర్‌ను తప్పించి ముఖ్యమంత్రిని నియమించే బిల్లును కూడా ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ గవర్నర్ పై చాలా కాలంగా కారాలు మిరాయాలు నూరుతోంది. గవర్నర్ కూడా అంతే. బిల్లులు కూడా తన వద్దనే పెండింగ్ పెట్టుకుంటున్నారు కానీ ఆమోదించడం లేదు.. తిరస్కరించడం లేదు. అందులో యూనివర్శిటీల్లో నియామకాల బిల్లు కూడా ఉంది. విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా గవర్నర్ వ్యవహరిస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, కేరళల్లో గవర్నర్ల నుంచి చిక్కులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలు చాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఉన్న నియమ నిబంధనలను మారుస్తూ చట్టాలు చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఇక నుంచి గవర్నర్ సారథ్యం అవసరం లేదని కేరళ, బెంగాల్ ప్రభుత్వాలు ప్రకటించాయి. నిజానికి గతంలోనే ఇలాంటి ప్రచారం జరిగింది. గత ఏడాది పది మంది ఉపకులపతులను ఎంపిక చేస్తూ తుది ఆమోదం కోసం గవర్నర్‌కు పంపగా తమిళిసై కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తర్వాత కేసీఆర్ జోక్యంతో అనుమతించారు. ఇప్పటికీ ములుగు ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రిని చాన్స్‌లర్‌గా నియమించే బిల్లును కూడా గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంది.
విశ్వవిద్యాలయాలు చేపట్టే అధ్యాపకుల నియామకాల్లో గవర్నర్ పాత్ర కీలకం. అక్కడా గవర్నర్ వైపు నుంచి చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్సిటీల చాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదం పొందినా, దానిపై సంతకం చేయాల్సింది గవర్నరే కావడం అసలు ట్విస్ట్. అయితే ఈ విషయంలో గవర్నర్‌కు ఉండే అధికారాలు పరిమితం. ఓ సారి తిరస్కరిస్తే.. మరోసారి బిల్లు ఆమోదించుకోవచ్చు. గవర్నర్ అంగీకరించకపోయినా చట్టం అయిపోతుంది. కానీ.. అటు ఆమోదించకుండా… ఇటు తిరస్కరించకుండా పెండింగ్‌లో ఉంచితేనే అసలు సమస్య. ఇప్పుడు తమిళిసై అదే చేస్తున్నారు.