రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కించిత్ పట్టించుకోవడం లేదు సరి కదా ఇంకా వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఈడీకి మరింత బలాన్ని చేకూర్చేలా మోడీ సర్కారు కొత్త నిర్ణయం తీసుకుంది. ఈడీ మరో 15కు పైగా ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకునేందుకు ఇది అనుమతినిస్తుంది. ఈ పదిహేను ఏజెన్సీల్లో రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు కూడా ఉన్నాయి. రాష్ట్ర పోలీసు విభాగాలను ఇది ఈడీ పరిధిలోకి తీసుకొస్తుంది. ఈ
డీ కోరిన ఏ సమాచారమైనా రాష్ట్రాల పోలీసులు సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర సంస్థలన్నీ కేంద్ర సంస్థలే. ఏజెన్సీకి అందిన సమాచారం ఆధారంగా అరెస్టులు లేదా ఆస్తులను అటాచ్ చేయవచ్చనీ, ఏజెన్సీల మధ్య సమాచారాన్ని పంచుకోవటం ద్వారా కొన్ని నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు స్వతంత్రంగా ఉన్నాయి. ఇక ముందు కూడా ఉంటాయి. కానీ నిర్బంధంగా ఈడీతో సమాచారం పంచుకోవాలన్న నిబంధనల కారణంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల.. పరోక్షంగా పోలీసు వ్యవస్థపై పట్టు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్న అంచనా ఉంది.
సీబీఐకి ఉన్న పరిమితుల కారణమంగా విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట్ల… బీజేపీ తన ప్రయత్నాలు తాను చేసుకోలేకపోతోంది. అందుకే ఈడీకి అపరిమితమైన అధికారులు ఇస్తోంది. ఇటీవలి కాలంలో ఐటీ, సీబీఐ కన్నా ఈడీనే ఎక్కువగా యాక్టివ్గా ఉంది. నిజానికి ఈడీ ఎక్కువగా అక్రమ నగదు తరలింపులపైనే దృష్టి పెడుతుంది.కానీ విచిత్రంగా ఇటీవలి కాలంలో రాజకీయంగా కీలకంగా ఉన్న ప్రతీ కేసులోనూ ఏదో కోణం వెదుక్కుని జోక్యం చేసుకుంటోంది. దానికి కేంద్రం మరింత బలం చేకూర్చేలా వ్యవహరిస్తోంది.