జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సినిమాల ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత వెంటనే మరో రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటారని ఆయా సినిమాల రూపకర్తలు ప్రకటించారు. సుజిత్ డైరక్షన్లో ఓ సినిమాను కొత్తగా ఎనౌన్స్ చేయగా.. గతంలోనే ప్రకటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా కూడా వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని.. హరీష్ శంకరే ప్రకటించారు. ఎలా లేదన్నా ఒక్క సినిమా షూటింగ్‌కు కనీసం నాలుగు నెలలు పడుతుంది. మరికొన్ని కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి.
నిజానికి ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నాయి. పార్టీల అధినేతలు మరో మాటకు తావు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కూడా.. జనవరి నుంచి బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది. కానీ ఆయన షెడ్యూల్ మాత్రం బిజీగా ఉంది. ఓ సారి యాత్ర ప్రారంభిస్తే నిరాటంకంగా చేస్తారా లేకపోతే.. గ్యాప్‌లు ఇస్తూ మధ్యలోచేస్తారా అన్నదానిపై ఇప్పటికే డౌట్స్ ప్రారంభమయ్యాయి.చివరి ఏడాది అయినా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పవన్ కల్యాణ్ సమయం వెచ్చిస్తారని జనసైనికులు భావిస్తున్నారు కానీ అలాంటి చాన్స్ లేదని తాడా పరిణామాలతో స్పష్టమవుతోందని నిరాశపడుతున్నారు.
పవన్ కల్యాణ్ .. పార్టీని నడపడానికి.. లేకపోతే ఆర్థికపరమైన అంశాల కారణంగా సినిమాలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ాయన ప్యాకేజీ స్టార్ అని.. మరొకటని వైసీపీ నేతలు ఎంత వెటకారం చేసినా.. ఆయన పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి.. పార్టీని నడపడానికైనా తాను సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలోనూ ఇలా పవన్ సినిమాలతో బిజీగా ఉంటే ఆ ఎఫెక్ట్ పార్టీపై పడే ప్రమాదం ఉంది.