తెలంగాణ ప్రజలు హామీ ఇస్తే దేశ రాజకీయాల్లోకి వెళ్తామని సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఆయన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించినందున తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మోదీ అన్నారని మండిపడ్డారు. మీరు నాతోరండి.. నేను మీతో ఉంటా.. అందరం కలిసి దేశ రాజకీయాల్ని మార్చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్రం వల్ల తెలంగాణ సర్కార్‌కు మూడు లక్షల కోట్ల నష్టం జరిగిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్డీపీ ఇంకా పెరిగి ఉండేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా మారుతోందని… అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయని.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ ఒక్కటే పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అడ్డం పడుతోందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదు కానీ కాళ్లలో కట్టెలు పెడతారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చడానికి ఎనిమిదేళ్లు సరిపోకపోతే.. ఇక అనుమతులు ఇచ్చేది ఎప్పుడని కేంద్రాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో అద్భుతమైన ప్రగతి సాధించామని.. బీఆర్ఎస్ ద్వారా దేశం మొత్తాన్ని తెలంగాణ తరహాలో అభివృద్ది చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. గతంలో జిల్లాల పర్యటనల్లో కూడా కేసీఆర్ ఇదే రీతిన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు తనకు అండగా ఉంటే దేశ రాజకీయాల్లో ప్రభావం చూపుదామని పిలుపునిస్తున్నారు.