వైసీపీలో జగన్ తర్వాత ఎవరు ? ఇలాంటి ప్రశ్నకు చాన్సే లేదు. ఎందుకంటే ఒకటి నుంచి వంద.. వెయ్యి వరకు జగనే ఉంటారు. అందుకే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈసీ కొట్టేసిందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. వైసీపీలో జగన్ తర్వాత మరో స్టార్ క్యాంపెయినర్ కూడా లేరు.త తల్లీ, చెల్లీ దూరమయ్యారు. మరోసారి ప్రచారానికి వస్తారన్న గ్యారంటీ లేదు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేసి.. ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గట్టి ప్రయత్నాలు చే్తున్నారు. అందుకు సీమ గర్జన సభను ఎంచుకున్నారు.
సీమ గర్జన అంతా సజ్జల కనుసన్నల్లోనే !
సీమ గర్జన సభ పూర్తిగా సజ్జల కనుసన్నల్లో జరుగుతోంది. ఆయనే సీమలో పెద్ద నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ఇక్కడ సజ్జల పార్టీ మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకున్నట్లుగా తానే … పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లుగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. సభలో కూడా మొత్తం నాయకులు ఆయన చుట్టూనే తిరగనున్నారు. ఇంకా విషయం ఏమిటంటే.. సీమగర్జనలో ప్రధాన ప్రసంగం ఆయనదే. దీంతో తనను తాను ప్రజా నాయకుడిగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.
పార్టీ, ప్రభుత్వం రెండూ సజ్జల గుప్పిట్లోనే !
ఇప్పటికే పార్టీ, ప్రభుత్వం రెండూ సజ్జల కనుసన్నల్లోనే ఉన్నాయి. చిన్న కానిస్టేబుల్‌ను బదిలీ చేయాలన్నా ఆయనే నిర్ణయం తీసుకుంటారు. సలహాదారులు ఎంత మంది ఉన్నా..ఆయన సలహాలు మాత్రమే అమలవుతూ ఉంటాయి. ఉద్యోగులతో ఆయనే మాట్లాడతారు. పాలసీలు ఆయనే డిసైడ్ చేస్తారు. ఇక పార్టీ వ్యవహారాలూ అంతే. ఆయన ఏది చెబితే అది జరుగుతుంది. ఓ రకంగా ఇప్పుడు జగన్ ఉత్సవమూర్తి..కానీ సజ్జల పూజారి.
వ్యూహం ప్రకారమే ప్రజా నాయకుడిగా మారేందుకు సజ్జల ప్రయత్నం !?
ఇప్పటి వరకూ సజ్జల పార్టీ నేతలు, అధికారులకే తెలుసు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. పార్టీలో మాత్రం పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన నేరుగా ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూండటం ఆ పార్టీలోనూ చర్చనీయాంశమవుతోంది. ప్రజల్లోనూ గుర్తింపు కోసం ఆయన ఆత్రపడుతున్నారని .. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపు ఏదైనా తేడా వస్తే వ్యవహారం అంతా ఆయన గుప్పిట్లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు. కాస్త ప్రజామద్దతును కూడా కూడగట్టుకుంటే..ఆయనకు తిరుగుండదని చెబుతున్నారు.