దర్శకుడు బాల, సూర్య లది సూపర్ హిట్ కాంబినేషన్. ‘శివ పుత్రుడు’ లాంటి క్లాసిక్ వీరి కాంబోలో వచ్చింది. చాలా కాలం తర్వాత వారిద్దరూ కలిసి ఇటీవల ‘వనన్గాన్’ (అచలుడు) అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి సూర్య వైదొలిగినట్టు తాజాగా దర్శకుడు బాలా ప్రకటించారు.
”మా తమ్ముడు సూర్యతో ‘వనన్గాన్’ అనే సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నాను. అయితే కథలో కొన్ని మార్పుల వల్ల ఈ కథ సూర్యకి సూట్ అవుతుందా అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. సూర్యకి నాపై, ఈ కథపై పూర్తి నమ్మకం ఉంది. అంత ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న తమ్ముడు సూర్యకి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండ చూడటం అన్నగా నా కర్తవ్యం. ఈ విషయంలో ఇద్దరం చర్చించుకున్నాం. ఈ సినిమా నుంచి సూర్య తప్పుకుంటాడని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం. దీనికి చాలా బాధగా ఉన్నా, ఇది అతని శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయం.” అని చెప్పుకొచ్చారు బాల. అయితే ఈ సినిమాలో సూర్య లేకపోవచ్చు కానీ సినిమా మాత్రం ఉంటుందని వెల్లడించారు బాల.