విజయవాడలోని దేవినేని అవినాష్ ఇళ్లల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని వంశీరామ్ బిల్డర్స్ పై జరుగుతున్న ఐటీ దాడులకు .. వీరి ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ దాడులు అనుబంధం అని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని వంశీరామ్ బిల్డర్స్ అక్కడి అధికార పార్టీ పెద్దలకు సన్నిహితులు. ఈ సంస్థ.. దేవినేని కుటుంబానికి చెందిన స్థలాన్ని డెవలప్మెంట్కు తీసుకుంది.
పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వైపు వెళ్లే రోడ్డులో ఓ విశాలమైన స్థలం దేవినేని కుటుంబానికి చెందిన కొంత మంది వ్యక్తుల పేర్లతో ఉన్న కంపెనీపై రిజిస్టర్ అయింది. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఇలా జరిగింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ స్థలం తమ బినామీలది కాదని.. తమదేనని.. తమ దగ్గర సొమ్ము లేదు కాబట్టి కంపెనీల పేరు మీద కొన్నామని అప్పట్లో దేవినేని నెహ్రూ వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత వివాదం సెటిల్ అయిందేమో కానీ.. ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్‌కు డెలవప్‌మెంట్‌కు ఇచ్చారు. ఈ వ్యవహారంలో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదులు వచ్చాయేమో కానీ ఐటీ , ఈడీ దాడులు చేస్తోంది. మొత్తంగా టీఆర్ఎస్ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేసిన విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే ఈ సోదాల్లో. . వైసీపీ నేతలు దొరికిపోతూండటమే ఆసక్తికరంగా మారింది.