రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించారు. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 182 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 130 సీట్ల వరకూ వస్తాయని అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి కానీ.. టఫ్ ఫైట్ ఉంటుందని.. చెబుతున్నారు. హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 35 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
గుజరాత్‌లో ఈ సారి కూడా గెలిస్తే వరుసగా బీజేపీ ఏడో సారి గెల్చినట్లవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధాని అయిన మోదీ.. స్వయంగా ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ ప్రధాని చేయని విధంగా రోడ్ షోలు చేశారు. చివరికి ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు కూడా ఆయన అదే పని చేశారు. ఇలాంటి వాటిపై విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. అయినప్పటికీ బీజేపీకే ఎడ్జ్ ఉందని ఎగ్జిట్ పోల్స్ రావడం ఆసక్తి రేపుతోంది. ఇండియాటుడే – యాక్సిస్ సంస్థ మాత్రం .. హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.
ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి. కానీ ఈ సారి ఒక్క దానిగా మార్చేసి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీకి 170 పైనే రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.