వాళ్లకి నాలుగు ఖాకీ డ్రెస్సులు పంపండి..లేకపోతే ఏపీలో పోలీస్ శాఖను మూసేశారని అనుకుంటారని.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పోలీస్ శాఖ తీరుపై డీజీపీకి సూచించారు. అయితే పోలీసు శాఖను మూసేశారని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. వైసీపీ అరాచకశక్తులకు అండగా ఉండేందుకు వారి రాజ్యాంగం.. రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ మార్చేసుకున్నారని జనం అంతా నమ్ముతున్నారు. ప్రతీ రోజూ దానికి సంబంధించిన ఉదాహరణలు వెలుగు చూస్తూనే ఉంటాయి.
టీడీపీ ఆఫీస్ నుంచి కింది స్థాయి నేత వరకూ ఎవరి ఇల్లైనా ధ్వంసమే !
సాక్షాత్తూ డీజీపీ ఆఫీసు పక్కన టీడీపీ ఆఫీసు ఉంది. అయినా వందల మంది దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దొరికిన వారిని కొట్టారు. అడ్డుకోలేదు సరి కదా.. వీడియో ఫుటేజీతో దొరికినా ఇప్పటి వరకూ వారికి కేసుల్లేవు. ఇంకా విచిత్రం ఏమిటంటే దాడి చేస్తూ టీడీపీ కార్యకర్తలకు డీజీపీ ఆఫీసులో పని చేసే ఓ సీఐ దొరికిపోయాడు. అంటే.. పోలీసులే అరాచకశక్తులగా మారిపోయారన్నమాట. ఆ స్థాయిలోనే దాడి జరిగితే.. ఇక రామచంద్ర యాదవ్ వంటి నాయకులను వదులుతారా ?. ఆయన ఇంటిపై దాడి చేస్తారని పోలీసులకు తెలుసు. అందుకే విధ్వంసం పూర్తయ్యే వరకూ రాలేదు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి ఆర్థిక మూలాలను విరిచేయడమే వైసీపీ నేతల లక్ష్యం. కొట్టి చంపుతామని బెదిరించడమే టార్గెట్. దానికి పోలీసుల అండ.
బాధితులపైనే కేసులు పెట్టి.. నిందితులకు రక్షణ కల్పించే పోలీసులు ఏపీకే ప్రత్యేకం !
అధికారంలోకి రాక ముందు జగన్ ఓ సందర్భంలో బాధితులపై కేసులు పెట్టేస్తామని ఘనంగా ప్రకటించారు. మాట తూలారేమో అనుకున్నారు. కానీ అది నిజమని ఇప్పుడు స్పష్టమవుతోంది. తనను చంపడానికే తన ఇంటిపై దాడికి తెగబడ్డారని.. రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేస్తే.. తీసుకోలేదు. మీడియాలో హైలెట్ అయిన తర్వాత కేసు నమోదు చేసినట్లుగా సమాచారం బయటకు పంపారు. అంతకంటే ముందే బాధితుడిపై నాలుగు కేసులు నమోదు చేయడం ఇక్కడ అసలు ట్విస్ట్. అసలు బాధితులపైనే కేసులు పెట్టడం అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత కామన్‌గా మారిపోయింది. పోలీసుల్ని చూసి బాధితులు జడుసుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడు పోలీసుల్ని ఎవరూ పోలీసులుగా చూడటం లేదు. వైసీపీ మనుషులుగానే చూస్తున్నారు.
రేపో మాపో పోలీస్ యూనిఫామ్ మార్చేసుకుంటే ఓ పనైపోతుంది !
బ్లూకలర్లోకి పోలీస్ యూనిఫామ్‌ను మార్చేస్తారేమోనని గతంలో టీడీపీ నేతలు .. రంగుల పిచ్చి గురించి సెటైర్లు వేసేవారు. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లకు ఆ రంగులు వేశారు. పోలీసులకు ఇచ్చిన వాహనాలకు బ్లూ కలర్ వేశారు. ఇక యూనిఫాం మార్చడమే మిగిలింది. యూనిఫాం నేరుగా మార్చకపోయినా… పోలీసులు ఇప్పుడు పూర్తిగా బ్లూకలర్లోకి మారిపోయింది. అలా పని చేసే వారికే పోస్టింగ్‌లు .. జీతాలు వస్తాయి. లేకపోతే లేదు. ఒకప్పుడు బీహార్ గురించి చెప్పుకునేవారు కానీ.. ఆ బీహార్ కన్నా ఘోరం అన్నట్లుగా ఏపీ అయిపోయింది. ఈ అరాచకానికి ముగింపు ఎప్పుడు లభిస్తుందో మరి !