సమాజంలో టీచర్లు గొప్ప విధులు నిర్వహిస్తారని ఎవరైనా అనుకుంటారు. భావి పౌరుల్ని తీర్చిదిద్దుతారని అందరూ టీచర్లను గౌరవంగా చూస్తారు. కానీ విచిత్రంగా ఏపీ సీఎం జగన్.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు మాత్రం టీచర్లు అంటే.. ఉరకనే జీతాలు తీసుకునే ఉద్యోగులు అనే అభిప్రాయం బలంగా ఉన్నట్లుగా ఉంది. వారిని అసలు ఉద్యోగులుగానే ట్రీట్ చేయడం లేదు. ద్వితీయ శ్రేణి ఖాతాలో వేసేశారు. చివరికి జీతాలు కూడా అంతే. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. దొరికినంత ఇస్తున్నారు. మిగతా శాఖల వారికి ముందుగా ఇస్తున్న ప్రభుత్వం. . టీచర్లకు మాత్రం మిగిలితే ఇద్దాంలే.. తర్వాత చూద్దాంలే అనుకుంటోంది.
గత కొన్ని నెలలుగా ఐదో తేదీ లోపు ఇతర శాఖ ఉద్యోగులకు జీతాలు పడేలా ప్రభుత్వం చూస్తోంది. కానీ ఉద్యోగులకు మాత్రం ఇరవయ్యో తేదీ వరకూ గ్యారంటీ లేకుండా పోయింది. ఇతరులకు ఎలాగోలా సర్దుబాటు చేసి టీచర్లను మాత్రం ఇలా వేధించడం ఏమిటని వారు పళ్లు నూరుకోవాల్సి వస్తోంది. టీచర్లపై ఇటీవలి కాలంలో అనేక భారాలు వేశారు. పని ఒత్తిడి పెంచారు. అయినా జీతాలను మాత్రం సమయానికి ఇవ్వడం లేదు … ఎవరైనా ప్రశ్నిస్తే.. రకరకాల వేధింపులు ఉండనే ఉంటాయి.
టీచర్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్ నమ్మించి మోసం చేశారని వారు మండిపడుతున్నారు. జగన్పై పాటలు రాసి.. ప్రజల్లో వైరల్ చేస్తున్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా జగన్పై వారు పాడిన పాటలు కోపం తెప్పించాయని అందుకే సీఎం వారిపై ప్రతీకారం తీర్చుంటున్నారని అంటున్నారు. మొత్తంగా ఏ సమాజం అయినా ఉపాధ్యాయుల్ని గౌరవంగా చూస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం దండగని అనుకుంటోంది. మరి అలాంటి సమాజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీలో అదే సాక్షాత్కరిస్తోంది.